తన భార్యని ఎవరో ఏదో అన్నారని ఆయన మొహాన్ని రెండుచేతులతో కప్పుకుని భోరుమనడమే ఓ అపశకునం. నిప్పునిప్పునని చెప్పుకునే నాయకుడిని ఎందుకు జైల్లో వేశారో, బెయిల్‌కూడా ఎందుకు రావడంలేదో అందరికీ అర్ధమవుతోంది. చెప్పడానికి కటువుగా ఉండొచ్చుగానీ ఆయన పరిస్థితి మాత్రం ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లే ఉంది. సిల్క్ డెవలప్‌మెంట్‌లో ఒక్క రూపాయి దుర్వినియోగం కావడం లేదని చెప్పడంలేదు. బాధ్యతని అధికారులమీదికి నెట్టేస్తున్నారు. అంటే అధికారులు ఏ ఫైల్ ముందుపెట్టినా గుడ్డిగా సంతకం చేసేస్తారా? ఖర్మకాలి అలాంటివన్నీ ఏదోనాడు మెడకు చుట్టుకుంటాయని గ్రహించలేకపోయారా?
రాజకీయాల్లో చంద్రబాబుకి ఓ పేరుంది. ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారనీ, న్యాయవ్యవస్థకూడా దానికి మినహాయింపేమీ కాదనే నిన్నామొన్నటిదాకా అంతా అనుకునేవారు. మరి అలాంటి నాయకుడి ప్రయత్నాలన్నీ ఇప్పుడెందుకు ఇలా విఫలమవుతున్నాయంటే అదంతే.. ఖర్మకాలినప్పుడు అన్నీ అలాగే జరుగుతాయి. హైకోర్టులో సర్కారు కేసు వీగిపోతుందనుకున్నారు. కానీ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆ షాక్‌నుంచి తేరుకోకముందే రెండ్రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించింది. ఆయన రిమాండ్‌ని 24దాకా పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ అధినేత తన భవిష్యత్తును ఊహించలేకపోయారు. నంద్యాలలో తెల్లవారుజామున అరెస్ట్‌చేసినప్పుడు రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుందనుకున్నారు. కానీ చాలాచోట్ల పార్టీ తమ్ముళ్లే అంత భావోద్వేగానికి గురికాలేదు. జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు ఇంత పెద్దాయన్ని ఇలా అరెస్ట్ చేస్తారా అని పోలీసుల్ని కడిగేసి బెయిల్ ఇస్తారనుకున్నారు. కానీ రిమాండ్‌కి పంపారు. క్వాష్ పిటిషన్, కస్టడీ పిటిషన్ విషయంలోనూ ఆయన అంచనాలు తప్పాయి.
ఏపీ ప్రభుత్వంతో న్యాయవ్యవస్థ కుమ్మక్కైందని నిందలు మోపగలరా? ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టే సీఐడీ వాదనతో న్యాయస్థానాలు ఏకీభవిస్తున్నాయి. ఇంటికి కన్నమేసే దొంగకూడా వేలిముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడతాడు. ఇంత అనుభవముండీ ఇలా అడ్డంగా దొరికిపోవడం స్వయంకృతం కాక మరేమిటి? ఇప్పుడు మిగిలింది సుప్రీంకోర్టే. అత్యున్నతన్యాయస్థానం కూడా పోలీసుల వాదనతో ఏకీభవిస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. సారీ 45 ఇయర్స్ అనుభవమున్న లీడర్‌ని ఇక ఆ దేవుడే కాపాడాలి!