కేటీఆర్‌ ఏంటి.. అంత మాటనేశారు!

ktr-and-chandrabbaunaidu.jpg

చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ అట్టుడకలేదు. బ్రహ్మాండమేమీ బద్దలుకాలేదు. నిరసనలు జరుగుతున్నాయంతే. పోలీసులు ముఖ్యనేతల్ని గడపదాటనివ్వకపోవడంతో భారీ ఎత్తున రోడ్లపైకొచ్చే అవకాశం లేకపోయింది. మిగిలిన రాష్ట్రాలు, విదేశాల్లో నిరసనల సంగతేమోకానీ, టీడీపీ ఎప్పుడో ఆశలు వదిలేసుకున్న హైదరాబాద్‌లో, ఖమ్మంలాంటి జిల్లాల్లో ఐటీ ఉద్యోగుల నిరసనలు, చంద్రబాబుకి సంఘీభావర్యాలీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హైదరాబాద్‌ని ఈ రేంజ్‌కి తీసుకొచ్చింది నేనేనని పదేపదే చెబుతుంటారు చంద్రబాబు. దాంతో కొందరు ఏకీభవించినా వ్యతిరేకించినా మొత్తానికి ఆయన పాత్ర ఎంతోకొంత ఉందన్న మాటైతే వాస్తవం.

చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసనలతో బీఆర్‌ఎస్‌ సర్కారు అప్రమత్తమైంది. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేశారు. ఏపీకి చెందిన చాలామంది టెక్కీలు ఇక్కడే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. టీడీపీ జెండా ఎత్తేసినా ఆ పార్టీ సానుభూతిపరులు, చంద్రబాబుకు మద్దతిచ్చే సామాజికవర్గంబలంగానే ఉంది. అందుకే హైదరాబాద్‌లో అంత రియాక్షన్‌ పెద్దగా ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. తెలంగాణలోనూ నిరసనలు జరిగితే ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందనీ, దేశమంతా దీనిపై చర్చ జరుగుతుందని టీడీపీ ఆశించింది. అందుకే నారా లోకేష్‌ పనికట్టుకుని దీనిపై తెలంగాణమంత్రి, సీఎం వారసుడు కేటీఆర్‌తో మాట్లాడినట్లుంది.

ఒకప్పుడు చంద్రబాబుని ఉతికారేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులులాంటి వారు కూడాచంద్రబాబు అరెస్ట్‌ని ఖండించారు. కేసీఆర్‌ నోరుమెదపలేదు కానీ ఆయన పార్టీకి చెందిన కొందరు నేతలు దీనిపై స్పందించారు. ఇప్పుడు కేటీఆర్‌ కూడా అనివార్యంగా దీనిపై మాట్లాడినా చంద్రబాబు అరెస్ట్‌ని ఏపీకి సంబంధించిన రాజకీయ ఇష్యూగానే చూశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య విషయమని కేటీఆర్ సింపుల్‌గా తేల్చేశారు. ఏపీలో అరెస్ట్‌ జరిగితే హైదరాబాద్‌లో ర్యాలీలు తీయడం, దీనికి పోటీగా మరో పార్టీ నిరసనకు దిగడం ఇవన్నీ మంచివి కాదంటున్నారు కేటీఆర్‌. ఏపీ విషయంలో ఆందోళనలు ఆ రాష్ట్రానికే పరిమితం కావాలని చెప్పేసి.. హైదరాబాద్‌లో అంత ఛాన్స్‌ ఇవ్వమని చెప్పకనే చెప్పేశారు.

జగన్, చంద్రబాబు, పవన్ అంతా తమకు మంచి ఫ్రెండ్సేనంటున్నారు కేటీఆర్‌. చంద్రబాబుకు మద్దతు నిరసనలకు అవకాశం ఇచ్చి జగన్మోహన్‌రెడ్డికి దూరంకాలేరు. అప్పుడప్పుడూ తమను పొగిడే పవన్‌కల్యాణ్‌ని చెడు చేసుకోలేరు. అంటే చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించలేరు. అలాగని సమర్ధించరు కూడా. హైదరాబాద్‌లో లా అండ్‌ ఆర్డర్‌ ముఖ్యమంటున్నారు కేటీఆర్‌. రెండు రాజకీయ పార్టీల తగాదాలో తమను లాగొద్దంటున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో నిరసనలతో తెలంగాణలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో సెటిలర్స్‌తో సమస్య వచ్చిందేమోగానీ ఇప్పుడంతా ఒకటే. చదువుకునేవారికి, ఐటీ ఉద్యోగాలు చేసుకునేవారికి ఏపీ కంటే హైదరాబాదే ముఖ్యం. అంత నిరసనలు చేయాలనుకుంటే వీకెండ్‌లో బార్డర్‌ దాటడం తప్ప కేసీఆర్‌ని, కేటీఆర్‌ని కాదని స్లోగన్‌ కూడా ఇవ్వలేరు. క్లారిటీ వచ్చేసింది కదూ!

Share this post

submit to reddit
scroll to top