ఓ ఇద్దరు పోలీసులు వెళ్లి ఏదో అలా వెళ్లి ఎవరో ఓ చిన్న నేరగాడిని పట్టుకుని తీసుకొచ్చినట్లు అమెరికా బలగాలు ఏకంగా ఓ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అరగంటలో అరెస్టు చేసి తీసుకుపోయాయి. వెనెజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియాని బెడ్రూంలోకి జొరబడి మరీ బంధించిన అమెరికా… న్యూయార్క్‌లో వాళ్లను విచారిస్తుందట. ఆదుకుంటాయి అనుకున్న చైనా, రష్యాలు నోళ్లు కుట్టేసుకోవటంతో.. ఆదుకునేవారికోసం వెనెజులా ప్రజానీకం దిక్కులు చూస్తోంది.
హ్యూగో చావెజ్ బతికి ఉన్నంతకాలం వెనెజులాను టచ్ చేయలేకపోయింది అగ్రరాజ్యం. ఇప్పుడు అదును చూసి, డ్రగ్స్ నిందవేసి వెనెజులాని తన గుప్పెట్లోకి తీసుకుంది. బస్సు డ్రైవర్ నుంచి ఓ దేశాధ్యక్షుడిగా ఎదిగిన మదురో ప్రస్థానాన్ని తనదైన ఆపరేషన్‌తో ముగించేసింది. తమ దేశాధ్యక్షుడిని అమెరికా లిఫ్ట్ ఎత్తుకెళ్లిందనే విషయం మొత్తం ఆపరేషన్ అయ్యాక గానీ తెలియలేదు వెనెజులా ఆర్మీకి. వెనెజులాకు చైనాకు చెందిన అత్యాధునిక నిఘా వ్యవస్థలు, రష్యాకు చెందిన శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థలున్నా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిపోయింది అమెరికా డెల్టా ఫోర్స్.
వెనెజులా దురాక్రమణని చైనాలాంటి దేశాలు ఖండిస్తున్నా చేయగలిగిందేమీ లేదు. పైగా ప్రపంచ రాజకీయాల్లో ఇది కీలక మలుపు కాబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనెజులాపై అమెరికా కన్నేసింది. అయితే వెనెజులా విషయంలో అమెరికా వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే లాటిన్ దేశాలన్నీ ఏకమై ఎదురుతిరిగితే అమెరికాకు కొత్త సవాళ్లు తప్పవు. వియత్నాంని నల్లిని నలిపేసినట్లు నలిపేద్దామనుకుంటే ఏం జరిగిందో అమెరికాకు స్వానుభవమే.
ప్రపంచానికి సుద్దులు నేర్పే పెద్దన్నే హద్దులు దాటుతున్నాడు. దురాక్రమణ తప్పని చెప్పే హక్కు కోల్పోయింది అమెరికా. వెనెజులా ఆక్రమణ తైవాన్ విషయంలో చైనాకు సిగ్నల్ కావచ్చేమో. ఇంకెన్నేళ్లు యుద్ధంచేయాలని రష్యా సైన్యం కూడా జెలెన్స్కీ ఎత్తుకొస్తుందేమో. పీవోకేని స్వాధీనం చేసుకోవాలనే భారత్ వ్యూహాత్మక లక్ష్యానికి లైన్ క్లియర్ అవుతుందేమో. పీవోకే సంగతి దేవుడెరుగు.. అమెరికా మదురోని ఎత్తుకొచ్చినట్లే.. పాక్‌లో ఆపరేషన్‌చేసి మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులను పట్టుకొచ్చేయమని సలహా ఇస్తున్నాడు అసదుద్దీన్ ఒవైసీ. ప్రపంచ పెద్దన్న ట్రంపరితనం ఇలాంటి ఎన్ని ఆలోచనలు పుట్టిస్తోందో!.





