సిన్మాల్లో చూసుంటామేమో. కానీ అక్కడ జరుగుతోంది మాత్రం రియల్‌స్టోరీ. జనవాసాల్లో తోడేళ్లు వేటాడుతున్నాయి. పసిపిల్లల్ని పీక్కుతినేస్తున్నాయి. రెండ్నెల్లనుంచి యూపీలోని బహరాయిచ్ తోడేళ్ల దాడులు ప్రతీకార చర్యల్లా కనిపిస్తున్నాయి. తోడేళ్లు కూడా మనుషులపై పగబడతాయా అన్న అనుమానాలొస్తున్నాయి. అసలు 30 ఏళ్ల తర్వాత మళ్లీ జనాలపై తోడేళ్లు ఎందుకు దాడి చేస్తున్నాయనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
యూపీలో బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడితో 10 మంది చనిపోయారు. అందులో తొమ్మిదిమంది చిన్నారులు. మనిషి రక్తం రుచి మరిగిన తోడేళ్లను పట్టుకోవడానికి యోగి సర్కార్ ఆపరేషన్ భేడియా స్టార్ట్ చేసింది. ఇప్పటికి ఐదు తోడేళ్లను పట్టుకుంది. కానీ ఇంకా ఎన్ని కనిపించకుండా దాక్కున్నాయో తెలీదు. తోడేళ్ల దృష్టి మరల్చడానికి రకరకాల వ్యూహాలు అమలు చేసింది యూపీ ప్రభుత్వం. గ్రామాల సమీపంలో ఏనుగు పేడ, మూత్రాన్ని కూడా చల్లారు. పిల్లల మూత్రంతో తడిపిన టెడ్డీ బొమ్మలను ఎరగా వేసి తోడేళ్లని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా తోడేళ్ల దాడులు ఆగకపోయేసరికి చివరికి షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చారు.
సహజంగా తోడేళ్లు ఎప్పుడూ మనుషులపై దాడి చేయవు. కానీ 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అలజడిని చూసి తోడేళ్లకు కూడా ప్రతీకారం ఉంటుందనే చర్చ సాగుతోంది. కొందరు అటవీ అధికారుల అనుమానం కూడా ఇదే. తోడేళ్లు కూడా ప్రతీకారంకోసం దాడులు చేస్తాయంటున్నారు వాటి గురించి అధ్యయనం చేసిన అధికారులు. వాటి నివాసాలు, పిల్లలకు హాని చేస్తే అవి కచ్చితంగా మనుషులపై దాడులు చేస్తాయన్నారు. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గ్రామస్థులు కూడా అదే నిజమై ఉండొచ్చని నమ్ముతున్నారు. ఓ చెరుకు తోటలో రెండు చనిపోయిన తోడేలు పిల్లల్ని గ్రామస్థులు గుర్తించారు. వాటిని తామే చంపామన్న అనుమానంతో తోడేళ్లు తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని చెబుతున్నారు.
తోడేళ్లు ప్రతికారంతోనే దాడి చేస్తున్నాయన్న భయంతో బహరాయిచ్ జిల్లాలోని 30 గ్రామాల ప్రజలు ఒంటరిగా అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. చిన్న అలికిడి వినిపించినా ఉలిక్కిపడుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలు పనులకెళ్లడం మానేశారు. ఊళ్లలో దుకాణాలు మూసేశారు. పిల్లల స్కూళ్లు మానేశారు. కనీసం ఇంటి ముందు ఆడుకోవడానికి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు బయటకు పంపనంత భయాందోళనలు అలుముకున్నాయి. మరోవైపు తోడేళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులను వైల్డ్ లైఫ్ యానిమల్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషించారు. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికెళ్లాలో తెలీకే అవి గ్రామాలపై దాడులు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం కోసం గ్రామాలపైకి వస్తున్నాయని, ఆకలితో ఉన్నప్పుడు చిన్నపిల్లలపై దాడులకు తెగబడుతున్నాయని చెబుతున్నారు. కారణాలేమయినా తోడేళ్లగురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడని ప్రజలు అవి మాటువేసి దాడులు చేస్తున్న ఘటనలతో నిలువెల్లా వణికిపోతున్నారు.