బుల్డోజర్‌ బాబాలా రేవంత్‌రెడ్డి హైడ్రా!

hydra.jpg

అందరికీ తెలిసిన పాపులర్‌ డైలాగ్‌. గుండెల్లో గురిచూసి ట్రిగ్గర్‌ నొక్కాక హీరో అంటాడు.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా! ఎన్నో సిన్మాలు వస్తున్నాయ్‌ పోతున్నాయ్‌. కానీ ఆ డైలాగ్‌ అందరికీ ఇంకా గుర్తుంది. అలాగే ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించుకోవాలనుకుంటున్నారు ఆ నాయకుడు కూడా. ముఖ్యమంత్రి పదవితో తన జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న రేవంత్‌రెడ్డి పదవిలో ఉండగానే పదికాలాలపాటు తన పేరు నిలిచిపోయేలా చూసుకోవాలనుకుంటున్నారు. వేలికేస్తే కాలికేస్తే నేతలున్న పార్టీలో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

హైడ్రా. చెరువుల పరిరక్షణకు, ప్రభుత్వస్థలాల్లో ఆక్రమణల తొలగింపుకు ఓ కొత్త వ్యవస్థని రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పుడు అయ్యేదా చచ్చేదా అనుకున్నారు చాలామంది. ఉన్న వ్యవస్థలతో పనిచేయించకుండా కొత్తవేవో సృష్టించినా ఒరిగేదేమీ ఉండదనుకున్నారు. కానీ ప్రొక్లయిన్లు ఓ పాపులర్‌ హీరో కన్వెన్షన్‌ని కూల్చేశాకే అందరికీ తెలిసొచ్చింది దాని పవరేంటో! పదేళ్లక్రితం పునాదులు పడ్డ తన కన్వెన్షన్‌ని ఎవరూ టచ్‌ చేయలేరని నటసామ్రాట్‌ పుత్రరత్నం ధీమాపై దెబ్బకొట్టారు రేవంత్‌రెడ్డి. ఏదో నోటీసులిచ్చి హడావిడి చేయడం కాదు.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలోపు ఎన్‌ కన్వెన్షన్‌ని నేలమట్టంచేశాయి హైడ్రా బుల్డోజర్లు.

తెలంగాణను చెరపట్టిన ఆంధ్రాబాబుల భరతం పడతానని కేసీఆర్‌ పంచ్‌డైలాగులెన్నో చెప్పారు. ఉద్యమపార్టీ అధికారంలోకి రాగానే ఆయన కూడా రాజీపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నాగార్జునలాంటి హీరోల అక్రమ కట్టడాలను కూల్చడం కాదు కదా.. కంచెవేసినట్లు కాపు కాశారు. పుత్రరత్నం కోటాలో ఎన్‌ కన్వెన్షన్‌పై ఈగవాలకుండా చూసుకున్నారు. నోటీసులు కూడా ఇవ్వలేదు. అలా కూల్చేయడం తప్పుకదా అంటూ నీతిసూత్రాలు వల్లిస్తున్నారు యువ(!)సామ్రాట్‌. తప్పని తేలితే మేమే మా స్వహస్తాలతో కూల్చేస్తాం కదా అంటున్నారు. కోర్టునుంచి స్టే వస్తే ఇప్పట్లో ఏదీ తేలదన్న ధీమా ఆయనది. నోటీసులిస్తే అక్రమార్కులెవరూ ఆధారాలు సమర్పించరు. కోర్టుకెక్కుతారు. ఆ తర్వాత బుల్డోజర్‌ తమదాకా రాకుండా చూసుకునేందుకు మరో మార్గం వెతుక్కుంటారు. అందుకే ఆ విషయంలో పక్కా క్లారిటీతో ఉంది రేవంత్‌రెడ్డి సర్కారు.

ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధిలో పరుగులు పెట్టిందా లేదా అన్నది వేరే సంగతి. కానీ యోగీబాబాకు అంత పేరొచ్చింది మాత్రం బుల్డోజర్లతోనే. విధ్వంసానికి దిగినా, రౌడీయిజం చేసినా, దారుణాలకు పాల్పడ్డా నిందితుల ఫ్యామిలీ అంతా రోడ్డునపడాల్సిందే. చట్టబద్ధమేనా, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగునా అన్న ప్రశ్నలు పక్కనపెడితే.. తక్షణచర్యలతో అసాంఘికశక్తులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ అయితే ఇవ్వగలిగారు యూపీ సీఎం యోగి. చెరువులోనో, ప్రభుత్వ జాగాలోనో ఎప్పుడో కట్టడం కట్టేసినంత మాత్రాన అది చట్టబద్ధమైపోదు. కరెంటుబిల్లులు, ప్రాపర్టీ టాక్స్‌ కట్టేసి ఇది మాదేనని చావుతెలివితేటలు ప్రదర్శిస్తే కుదరదు. అందుకే కోర్టులు జోక్యం చేసుకునేలోపు తన పనితాను చేసుకుపోవాలనుకుంటోంది రేవంత్‌రెడ్డి సర్కారు. నాగార్జున చట్టానికి అతీతమేమీ కాదని చెప్పేందుకే ఆయన కన్వెన్షన్‌ సెంటర్‌ని కూడా కూల్చేసింది. మరి ఆ బుల్డోజర్‌కి సొంత మంత్రులైనా, పాతబస్తీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఎంఐఎం నేతలయినా ఒకటేనని నిరూపిస్తేనే కూల్చివేతల యజ్ఞానికి సార్థకత చేకూరుతుంది.

రేవంత్‌రెడ్డికి స్ఫూర్తి బుల్డోజర్‌ బాబా కాదు. ధర్మో రక్షతి రక్షితః. అవును భగవద్గీత స్పూర్తిగా శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మరక్షణగా భావిస్తున్నామంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో ఆక్రమణల చెరనుంచి చెరువులను విడిపించే ప్రయత్నం చేయడం స్వాగతించదగ్గ పరిణామం. కానీ తరతమ చూడకుండా సొంత మనుషులున్నా ఉపేక్షించకుండా ముందుకెళ్తేనే ధర్మం రక్షించబడుతుంది. కూల్చివేతల క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆయన సంగతేంటి ఈయన సంగతేంటనే ప్రశ్నలొస్తాయి. అన్నిటికీ సిద్ధపడే హైడ్రాకు సీఎం రేవంత్‌రెడ్డి స్వేచ్చ ఇచ్చినట్లున్నారు. మరి ఈ ధర్మయుద్ధంలో విజేతలెవరో పరాజితులెవరో భవిష్యత్తే తేల్చిబోతోంది!

Share this post

submit to reddit
scroll to top