అనుభవాలు గుణపాఠం నేర్పుతాయన్నట్లు అధికారం అందని ద్రాక్షలా ఉండటంతో కాంగ్రెస్‌పార్టీ జాగ్రత్తపడుతోంది. తెలంగాణలో పీసీసీ ఎంపిక విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ని ఎంపిక చేయడమే కాదు.. పార్టీ నేతలకు ఓ మెసేజ్ కూడా పంపింది కాంగ్రెస్ అధిష్ఠానం. పీసీసీ పదవికోసం మధుయాష్కి గౌడ్ తీవ్రంగా ప్రయత్నించారు. సామాజికవర్గాల సమీకరణాల్లో మరికొందరు నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్‌నే ఎంపిక చేయడం వెనుక పార్టీకి ఫుల్ క్లారిటీ ఉన్నట్లే కనిపిస్తోంది. తెలంగాణలో రెండు పవర్ సెంటర్స్ ఉండకూడదనే మహేష్‌ని పీసీసీ పీఠంపై కూర్చబెట్టినట్లుంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నానుతూనే ఉంది పీసీసీ వ్యవహారం. రేవంత్ సర్కార్ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యంపై ఈమధ్య పార్టీలోనే కొందరికి అనుమానాలొచ్చాయి. ఎన్నికల ముందు బీసీలకు సీట్ల విషయంలో ఎలాగూ న్యాయం జరగలేదు.. కనీసం అధికారంలోకి వచ్చిన తరువాతనైనా బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్‌ని పీసీసీ చీఫ్ పదవి వరించినట్లు చెబుతున్నారు. నిజానికి ఈ పదవికోసం రెడ్డి సామాజికవర్గ నేతలతో పాటు ఎస్సీ, ఎస్టీ లీడర్లు కూడా గట్టిగానే ప్రయత్నించారు. కాని, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం మహేష్ కుమార్ గౌడ్‌నే ఎంపిక చేసింది.
మహేష్ కుమార్ గౌడ్‌కే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. కేవలం ఆ కారణంతోనే ఇచ్చారని చెప్పడానికి లేదు. వాస్తవానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర మిగతా నేతలకున్నంత పలుకుబడి మహేష్‌కుమార్ గౌడ్‌కి లేదని చెబుతారు. కాకపోతే ఆయన విధేయత, పనితీరు పార్టీ అగ్రనాయత్వానికి తెలుసు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన పనితీరు హైకమాండ్ దృష్టిలో పడింది. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో బీసీల నుంచి ఎన్నో డిమాండ్లు వచ్చినా ఆ సమయంలో అందరితో మాట్లాడి పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూసినవారిలో మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఒకరు. వివాదరహితుడైన మహేష్‌కుమార్ సీనియర్లకు విలువ ఇస్తారు. అందుకే ఆయన విషయంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంకాలేదు.
మహేష్ కుమార్ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంలో సామాజిక న్యాయంతో పాటు ప్రాంతీయ న్యాయం కూడా చేశారు. దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. ఉత్తర తెలంగాణ నుంచి మహేష్ కుమార్ గౌడ్‌కి పీసీసీ చీఫ్ ఇచ్చారు. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడి ముందు చాలా సవాళ్లున్నాయి. అన్నిటికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన ముందున్న పెద్ద టాస్క్. పార్టీలోని సీనియర్లను ఏకతాటిపై నడిపించడం మరో సవాల్. పైగా హైలెవెల్ కమిటీలు వేయాలి. 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఫుల్ సపోర్ట్ మహేష్‌కుమార్‌కి ప్లస్ పాయింట్‌ది. నిజానికి, ముఖ్యమంత్రి స్థానం, పీసీసీ అధ్యక్ష పదవి రైలు పట్టాల్లాంటివి. ఇద్దరూ సమన్వయంతో వెళ్తేనే పార్టీ, ప్రభుత్వం సాఫీగా నడుస్తాయి. అందుకే అధిష్ఠానం సీఎంకి అనుకూలంగా ఉండే లీడర్‌నే పీసీసీ చీఫ్‌ని చేశారని చెబుతున్నారు.