గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. వినడానికే కొత్తగా ఉంది కదూ. ఈ ప్రాజెక్టు ఆఫ్రికాను ఆకుపచ్చగా మార్చేసింది. ఇసుక తిన్నెల్లోనూ పచ్చని చెట్లు చిగురించేలా చేసింది. కొట్టుకుపోయే తీరప్రాంతాన్ని దృఢంగా నిలబెట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో ఈ ప్రాజెక్టు కోసం కంకణం కట్టుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో సమీక్షించారు.
తీరప్రాంతాలు కోతకు గురికాకుండా, మత్స్య సంపదను మరింత పెంచేలా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్ట్ సజావుగా సాగడానికి ఆయా శాఖలు ఎలా కలిసి పనిచేయాలి, నిధులను ఎలా ఉపయోగించాలి, ఏయే దశల్లో పనులు పూర్తి చేయాలనే దానిపైనా చర్చించారు. 2030 నాటికి ఈ ప్రతిష్టాత్మక పర్యావరణ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వెంట 1,034 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది ప్రభుత్వం
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు ఆఫ్రికాలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ ప్రాజెక్టుతో ఎడారి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటారు. మడ అడవులపై దృష్టి పెట్టి.. కేవలం పదేళ్లలో ఎంతో పురోగతి సాధించారు. అలల తాకిడి నుంచి తీర ప్రాంతాలను కాపాడుకున్నారు. ఉప్పును సైతం తట్టుకునేలా చెట్లను పరిరక్షించడంలో విజయవంతమయ్యారు. దీంతో ఆఫ్రికా గ్రేట్ గ్రీన్ వాల్‌ను ఒక్క ఏపీనే కాదు ఇప్పటికే ఎన్నో దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయి.





