ప్రాణాధార ఔషధాలు తయారుచేయాల్సిన ఫార్మా కంపెనీ నిండు ప్రాణాలు తీసింది. పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులను మంటల్లో మాడ్చేసింది. ప్రకృతి వైపరీత్యం కాదిది. మానవ తప్పిదం. నిలువెత్తు నిర్లక్ష్యం. చిన్నతేడా వస్తే ఎవరూ ప్రాణాలతో మిగలరని తెలిసినా.. కంటితుడుపు పరిహారంతో బయటపడొచ్చన్న ధైర్యం. అదే ఏ అమెరికాలోనో అయితే పరిహారంకోసం యాజమాన్యాలు ఉన్నదంతా అమ్ముకోవాల్సి వస్తుంది. అంత కఠినంగా ఉంటాయి అక్కడి నిబంధనలు. మనదగ్గర భద్రతా ప్రమాణాలు పట్టించుకోకపోయినా, పొట్టకూటికోసం పనిచేసేవారి ప్రాణాలను ఫణంగా పెట్టినా అడిగేవారుండరు.
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ మరుభూమిగా మారిపోయింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 40 మంది 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతున్నారు. భద్రతా ప్రమాణాల్లో రాజీపడ్డ ఎసెన్షియా ఫార్మా కంపెనీ మూలాలు అగ్రరాజ్యంలో ఉన్నాయి. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ఈ కంపెనీని స్థాపించారు. అమెరికాలో ఓ కంపెనీ పెట్టాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిసినవారే.. సొంత రాష్ట్రంలో అరకొర ప్రమాణాలతో ఫ్యాక్టరీ పెట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు.
అమెరికాలో ఎసెన్షియా గ్లోబల్ ఆఫీసు, రీసెర్చ్ సెంటర్, ల్యాబ్‌లు ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం (అచ్యుతాపురం సెజ్)లో దీని బ్రాంచీలు ఉన్నాయి. డాక్టర్ యాదగిరిరెడ్డి తన బంధువుతో కలిసి విశాఖలో ఎసెన్షియా ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఔషధ తయారీ యూనిట్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైందని చెబుతున్నారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు ఇక్కడే జరుగుతుంటాయని చెబుతున్నారు. ఆటోమేషన్‌తో పాటు భద్రత, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నట్టు కంపెనీ ప్రొఫైల్ చెబుతున్నా.. ఆచరణలో అది డొల్లేనని తేలిపోయింది. అమెరికాలో అయితే ఇలా రాజీపడటం కుదరదు. అందుకే కార్పొరేట్ సంస్థలు అమెరికాలో కేంద్ర కార్యాలయాలను, రీసెర్చ్ యూనిట్లను పెట్టుకుని.. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను మనదేశంలో పెడుతుంటాయి.
పరిశ్రమ పెడతామనగానే మన దగ్గరయితే ప్రభుత్వాలు కారుచౌకగా స్థలాలు ఇచ్చేస్తుంటాయి. ఇప్పుడు చచ్చిపోయిన మనోళ్లకి ఎప్పుడు పరిహారం అందుతుందో చూడాలి. సుమారు 22 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరో 22 కోట్ల రూపాయల షేర్లు అమ్మి మొత్తం రూ.42 కోట్లతో అచ్యుతాపురం సెజ్‌లో ఈ పరిశ్రమ ఏర్పాటైందని సమాచారం. ప్రభుత్వం నామమాత్రపు ధరకి 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. ఇక మనదగ్గరైతే ఉద్యోగులు, కార్మికులు చౌకగా దొరుకుతారు. జరగరానిది ఏదన్నా జరిగినా ఇండియాలోనైతే పెద్దగా ఆందోళన పడాల్సిన పనుండదు. పోయిన ప్రాణానికి వెలకట్టొచ్చు. కొన్నాళ్లకే జరిగింది మరిచిపోయేలా చేయొచ్చు. భోపాల్ యూనియన్ కార్బైడ్ కేసే దీనికి నిదర్శనం. మూడుదశాబ్దాలు గడిచినా ఈ కేసులో బాధితులకు పరిహారం అందలేదు. అదే అమెరికాలో ట్విన్ టవర్స్ బాధితులకు మూడేళ్లలోపు పరిహారం అందింది.
విశాఖ ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతులకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. కంపెనీ నుంచి పరిహారం కట్టిస్తామంటోంది. దోషులను విడిచిపెట్టే ప్రసక్తేలేదని చెబుతున్నా.. కాలమే గాయాన్ని మాన్పుతుందన్నట్లు కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు. మళ్లీ షరామామూలే. అనుకోకుండా మరో ప్రమాదమేదన్నా జరిగినప్పుడు పరామర్శలు, పరిహారాలతో కథ మొదటికొస్తుంది. గాలి నీరు కలుషితమవుతున్నా పాలకులకు పట్టదు. పరిశ్రమలు ప్రాణాలు తోడేస్తున్నా ప్రమాణాలు మెరుగుపడవు. పెట్టుబడులొస్తే, పరిశ్రమలు ఏర్పాటైతే చాలనుకుని పాలకులు రాజీపడినన్నాళ్లూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. అధికారుల ఉదాసీనత ఇంత ఘోరానికి కారణమైంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోందో?