ఇస్‌బార్ చార్‌సౌ పార్ అని మోడీ మైకులు అదరగొట్టినా.. సింగిల్‌పార్టీగా మ్యాజిక్ ఫిగర్‌ని కూడా టచ్‌చేయలేకపోయింది బీజేపీ. చివరికి చంద్రబాబు, నితీష్‌కుమార్ చెరో చేయి అందించటంతో ఎన్డీఏ సర్కారు నిలబడింది. బీజేపీ కూటమి గెలిచి ఓడినట్లయింది. కాంగ్రెస్ పరిస్థితి ఓడి గెలిచినట్లే ఉంది. పార్లమెంట్‌లో సభ్యుల ప్రమాణస్వీకారంతో పాటే మోడీ సర్కారుకు విపక్షాలనుంచి సెగ మొదలైంది. 50 ఏళ్ల కిందటి చారిత్రక తప్పిదం పునరావృతం కారాదంటూ చీకటిరోజుల్ని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ గురించి ఇంకెన్నిసార్లు మాట్లాడుతారంటూ మోడీకి కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏఐసీపీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే.
వాద సంవాదాలతో 18వ లోక్‌సభ ఆరంభంలోనే రచ్చ రాజుకుంది. ఎన్‌డీఏ సర్కార్‌కు సంఖ్యాబలమున్నా 17వ లోక్‌సభతో పోలిస్తే సభలో విపక్ష బలగం పెరిగింది. మ్యాజిక్ ఫిగర్ 272 అయితే బీజేపీకి సొంతంగా దక్కించుకున్నది 240 సీట్లే. మిత్రపార్టీలతో మద్దతుతో ఎన్‌డీఏ అధికార పగ్గాలు చేపట్టింది. 18వ లోక్‌సభ కొలువుదీరే సమయంలోనే దేశంలో నీట్ మంటలు నిప్పులు రాజేస్తున్నాయి. నీట్ నిర్వహణా లోపాలు.. పేపర్ లీకేజ్ వంటి అంశాలే అస్త్రంగా ఇప్పటికే రాహుల్ సహా కాంగ్రెస్ శ్రేణులు విమర్శలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాల టైమ్ నుంచే స్టాక్ మార్కెట్‌లో భారీ స్కామ్‌పై మోడీ టార్గెట్‌గా రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు.
సభ ఆరంభమైన తీరు చూస్తుంటే.. మోడీ సర్కారుకు ఇలాంటి సవాళ్లెన్నో ఎదురయ్యేలా ఉన్నాయి. ఇప్పటికైతే ఎన్డీయే కూటమి బంధం బలంగా ఉంది. పవర్ చేజారినా సరే గళం విన్పించే బలం పెరిగిందనే ధీమా కన్పిస్తోంది కాంగ్రెస్‌లో. అయినా తగ్గడమనేది మన బ్లడ్డులోనే లేదన్నట్లు తొలిరోజే తన మార్క్ టచ్ ఇచ్చారు ప్రధాని మోడీ.