పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందా?

telangana-politics.jpg

తెలంగాణ రాజకీయం మారుతోంది. వార్‌ వన్‌సైడ్ అన్నట్లు లేదిప్పుడు. తెలంగాణకోసం కొట్లాడిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బీఆర్‌ఎస్‌.. పదేళ్లు ఏలింది. బీఆర్‌ఎస్‌ హయాంలో మరో పార్టీ వాయిస్సే లేకుండా పోయింది. కానీ రెండు టర్మ్స్‌ తర్వాత కారు స్పీడ్‌కి బ్రేక్‌పడింది. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చింది. చూస్తుండగానే కాంగ్రెస్‌ ఏడాదిపాలన పూర్తయింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తర్వాత తెలంగాణలో ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది బీజేపీ.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్‌ఎస్‌ ఓటమి షాక్‌ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితం కావడం, తర్వాత అందులో 11 మైనస్‌ కావటంతో ఆత్మరక్షణలో పడింది బీఆర్‌ఎస్‌. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోవడం కేసీఆర్‌ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇదే సమయంలో బీజేపీ చాపకింద నీరులా బలం పుంజుకుంటోంది.
తెలంగాణలో కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం తానేనంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్‌, గ్రాడ్యుయేట్‌ స్థానాలను గెలుచుకుని కదనోత్సాహంతో ఉంది బీజేపీ. పార్లమెంట్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-బీజేపీ కూడబలుక్కున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. బీఆర్‌ఎస్‌ కాకపోతే బీజేపీ. కాంగ్రెస్‌కి ఆ రెండుపార్టీలు ప్రధాన ప్రత్యర్థులే. బీఆర్‌ఎస్‌ పూర్తిగా బలహీనపడితే బీజేపీతోనే తేల్చుకుందామన్నట్లుంది కాంగ్రెస్‌ ఆలోచన. అటు బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌పైనే విమర్శనాస్త్రాలు గురిపెడుతోంది బీజేపీ కూడా. ఆరు గ్యారంటీలనుంచి సంక్షేమపథకాల దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోస్తోంది బీజేపీ.

కాంగ్రెస్‌ని టార్గెట్‌ చేస్తూనే బీజేపీని నిలువరించడం బీఆర్‌ఎస్‌ ముందున్న పెద్ద టాస్క్‌. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటటం కారుపార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది. అందుకే రాజకీయంగా ఇక ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడానికి బీఆర్‌ఎస్‌ సిద్ధంగా లేదు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ తప్పుపడుతోంది. సీఎం వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదుచేసేదాకా వెళ్లటంతో సమ్మర్‌తో పాటే పెరుగుతోంది తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌.

తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ పాలన చూశారు. ఏడాదిలోనే కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయారు. గన్‌షాట్‌గా ఈసారి పవర్‌ మాదేనంటూ అధికారపీఠంపై గురిపెట్టింది బీజేపీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రధాన ప్రతిపక్షంతో పోటీపడింది కమలంపార్టీ. బీజేపీ హైకమాండ్‌ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకొచ్చేందుకు తెలంగాణలోనే ఎక్కువ స్కోప్‌ ఉందన్న నమ్మకంతో ఉంది. బీజేపీ యాక్టివిటీ పెరగటంతో బీఆర్‌ఎస్‌ అలర్ట్‌ అయింది. ప్రజల్లోకెళ్లేందుకు జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ అంశాన్ని కూడా ఓ అస్త్రంగా మలుచుకోవాలనుకుంటోంది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం ఎవరనే విషయంపై బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య ఫైట్‌ నడుస్తుంటే.. ఆ రెండుపార్టీలనీ ఎలాగోలా కంట్రోల్‌ చేయాలన్నది కాంగ్రెస్‌ ప్లాన్‌. బీజేపీ గురించి ఎక్కువ చర్చ జరగొద్దన్నది హస్తంపార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌తో వాదోపవాదాలైనా, జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ వ్యవహారమైనా ఏదో ఒక వివాదంతో బీజేపీని కాంగ్రెస్‌ సైడ్‌ చేస్తోందా అన్న అనుమానాలొస్తున్నాయ్‌ పొలిటికల్‌ పండిట్స్‌కి.

Share this post

submit to reddit
scroll to top