హలాల్‌ మనకొద్దు.. ఖావో ఝట్కా!

Halal-Jhatka.jpg

కొక్కొరొక్కోలైనా మేమేలైనా.. పీక కోశాకే ప్లేట్‌లోకొస్తాయి. ఇప్పుడా మాంసాహారం కొత్త వివాదాన్ని పులుముకుంటోంది. సంప్రదాయికంగా ముస్లింలు పాటిస్తున్న హలాల్‌ని వ్యతిరేకిస్తూ ఝట్కాని తెరపైకి తెస్తున్నాయి హిందూసంఘాలు. మహారాష్ట్రలోనైతే ఏకంగా ప్రభుత్వమే ఝట్కా మటన్‌ కొనమంటూ ప్రమోషన్‌ చేస్తోంది.

మాంసాహార ప్రియులు ప్రతీచోటా ఉంటారు. మటన్ దుకాణాలకి వెళ్లి మాంసం కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం అది చికెన్‌ అయినా, మటన్‌ అయినా హలాల్ చేసిన మాంసాన్నే కొనుగోలు చేస్తారు. ముస్లింలు నిర్వహించే షాపుల్లో మాంసాన్ని హలాల్ చేశాకే విక్రయిస్తారు. హలాల్‌పై కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త టర్న్‌ తీసుకుంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ హలాల్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హలాల్ మటన్‌కు వ్యతిరేకంగా ఝట్కాని తీసుకువచ్చింది. దీనికి మల్హార్ సర్టిఫికేషన్‌తో అధికారిక ముద్ర వేసింది. హిందువులంతా మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న షాపుల్లోనే ఝట్కా మటన్ కొనుగోలు చేయాలని స్వయంగా పిలుపునిచ్చారు మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే. ఇలాటి ఔట్‌లెట్స్ వందశాతం హిందువులే నిర్వహిస్తారు.

ముస్లింలు నిర్వహించే దుకాణాల్లో కోడిని, గొర్రె, మేకను హ‌లాల్ చేశాకే మాంసాన్ని విక్రయిస్తుంటారు. అయితే హిందూ మతాచారాల ప్రకారం జంతువులను వధించే విధానమే ఝట్కా. ఒకే వేటుతో జంతువుల తల, మొండెం వేరు చేస్తారు. హలాల్‌కు వ్యతిరేకంగా మాంసం విక్రయించే హిందూ దుకాణదారుల‌ను ఒక తాటిపైకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయ‌త్నాలు ప్రారంభించింది. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్న ఝట్కా మాంసం దుకాణాల‌ను ప్రోత్సహిస్తోంది.

హిందువులు, సిక్కులకు హలాల్ ర‌హిత‌ మాంసం విక్రయించాల‌న్న లక్ష్యంతో మాంసం మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది మహారాష్ట్ర సర్కారు. ఈ ఝట్కా మాంసం దుకాణాలను ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నడుపుతున్నట్లు ఈ సర్టిఫికెట్‌తో నిర్ధారిస్తారు. హిందూ సంప్రదాయాలను పాటించే వారు ఈ ఝట్కా మాంసాన్ని ఇష్టపడతారు. జంతువులను వధించి మాంసం తీయడంలో ఇదే నైతిక పద్ధతని విశ్వసిస్తారు.

మహారాష్ట్రలోని హిందువులు మల్హార్ సర్టిఫికేట్ లేని మాంసాన్ని కొనుగోలు చేయవద్దంటోంది అక్కడి డబుల్‌ ఇంజన్‌ సర్కారు. కర్నాటకలో కొన్నేళ్లుగా హలాల్‌ వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. యూపీలో హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్న ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏకంగా ప్రభుత్వమే హలాల్‌కి వ్యతిరేకంగా ఝట్కాని ప్రమోట్‌ చేస్తుండటంతో.. మరికొన్ని రాష్ట్రాలు దీన్ని అనుసరించేలా ఉన్నాయి.

Share this post

submit to reddit
scroll to top