స్టాలిన్‌ సెంటిమెంట్‌.. సెంటర్‌ ఆయింట్‌మెంట్‌!

Udayanidhi-30sep24.jpg

తమిళనాడులో ఎన్నికల వేడి తారాస్థాయికి వెళ్తోంది. వరుసగా రెండో సారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న స్టాలిన్ ప్రజల్ని ఓ సెంటిమెంట్ మైకంలో ఉంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హిందీ, డీలిమిటేషన్‌పై ఆపరేషన్ సౌత్‌ పేరుతో పోరాటం చేస్తున్నారు. మరోవైపు స్టాలిన్ ఎత్తులను చిత్తు చేసేలా బీజేపీ లిక్కర్‌బాంబ్ వదిలింది. దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడు ఎంకే స్టాలిన్అంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.

స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సారధ్యంలో వెయ్యికోట్ల మద్యం కుంభకోణం జరిగిదంటూ డీఎంకేపై ఆరోపణల వర్షం కురిపిస్తోంది బీజేపీ. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కంటే అతిపెద్ద కుంభకోణం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిందని నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనేపద్యంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నిరసనకు సిద్ధమైన బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని స్టేషన్‌కు తరలించారు. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ అమ్మకాల ద్వారా వెయ్యి కోట్లు ముడుపులు డీఎంకేకు అందాయన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఈడీ సోదాల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయంటోంది. అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రూపి సింబల్ పేరుతో డీఎంకే రాజకీయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ధ్వజమెత్తారు. మరోవైపు బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది డీఎంకే సర్కార్.

ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ డీఎంకే -బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే త్రిభాషా విధానంపై డీఎంకే , బీజేపీ మధ్య రచ్చ పీక్స్‌లో ఉంది. రెండు పార్టీ నేతల మధ్య సోషల్‌ వార్ కూడా జరిగింది. మోదీ సర్కార్‌ న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ పేరుతో నార్త్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని తమిళనాడుపై రుద్దేందుకు కుట్ర జరుగుతోందని డీఎంకే సోషల్ మీడియా ట్వీట్లతో హోరెత్తిస్తోంది. ఇటు బీజేపీ కూడా డీఎంకేకు కౌంటరిస్తూ స్టాలిన్‌పై బీజేపీ పేరడీ సాంగ్‌ విడుదల చేసింది. త్రిభాషా విధానంపై స్టాలిన్‌ రెండు నాల్కల ధోరణితో ఉన్నారని బీజేపీ విమర్శిస్తూ రివర్స్ అటాక్‌కు దిగింది.

డీలిమిటేషన్‌ పేరుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని. నియోజకవర్గాల పునర్విభజనలో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల పాలకులకు.. ప్రతిపక్ష పార్టీలకు డీఎంకే పిలుపునిస్తోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ డీఎంకే-బీజేపీ మధ్య పొలిటికల్ ఫైట్‌ నెక్ట్స్‌ లెవల్‌కు చేరుతోంది. వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే ప్రత్యర్ధికి అంతుచిక్కని ఎత్తులతో ప్రధాన పార్టీలు రాజకీయ సమరానికి దిగాయి.

 

Share this post

submit to reddit
scroll to top