తండ్రుల సౌధాలకు కొడుకులే బుల్డోజర్లు!

akhilesh-yadav-prateek-yadav-and-aparna-yadav-e1769097446906.jpg

దశాబ్దాలపాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంటూ తండ్రులు రాజకీయ సౌధాలు నిర్మిస్తే పుత్రరత్నాలు ఆ కొంపలు పీకేస్తున్నారు. బిహార్‌లో లాలూ కుటుంబంలో చిచ్చు చల్లారక ముందే యూపీలో ములాయం కుటుంబంలో ముసలం పుట్టింది. ములాయం చిన్నకుమారుడు ప్రతీక్‌యాదవ్‌ భార్య అపర్ణయాదవ్‌తో విడాకులు తీసుకుంటునట్టు ప్రకటించడం సంచలనం రేపింది. పేరు ప్రఖ్యాతుల కోసం తమ కుటుంబాన్ని అపర్ణ సర్వనాశనం చేస్తోందని ప్రతీక్‌ ఆరోపిస్తున్నాడు. అన్న అఖిలేశ్‌ బీజేపీపై పోరాటం చేస్తుంటే.. అదే పార్టీలో అపర్ణ ఉండటాన్ని ములాయం కొడుకు జీర్ణించుకోలేకపోతున్నాడు.

ములాయంసింగ్‌యాదవ్‌.. లాలూప్రసాద్‌ ద్వయం ఒకప్పుడు కింగ్‌ మేకర్స్‌. నేషనల్‌ ఫ్రంట్ సర్కార్‌ , యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఆ ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్‌ని ములాయంసింగ్‌, బిహార్‌ను లాలూప్రసాద్‌ యాదవ్‌ దశాబ్దాల పాటు శాసించారు. కానీ విచిత్రంగా ఇప్పుడు ఈ రెండు కుటుంబాల గొడవలు వీధినపడుతున్నాయి. వారసత్వాన్ని నిలబెట్టాల్సిన కొడుకులే పరువు తీసేస్తున్నారు. బిహార్‌ ఎన్నికల ఫలితాల తరువాత లాలూ కుటుంబం విచ్ఛిన్నమైతే.. ఇప్పుడు ములాయం కుటుంబంలో ముసలం పుట్టింది.

అఖిలేశ్‌యాదవ్‌కు ప్రతీక్‌ యాదవ్‌ సవతి సోదరుడు. కాకపోతే ఆ ఇద్దరి మధ్య ఎప్పుడూ విభేదాలున్నట్లు వార్తలు రాలేదు. ములాయంసింగ్‌ రెండో భార్య కుమారుడు ప్రతీక్‌యాదవ్‌. అఖిలేశ్‌యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ వ్యవహారాలు చక్కబెడుతుంటే ప్రతీక్‌యాదవ్‌ బిజినెస్‌ చేస్తున్నారు. బీజేపీలో ఉన్న ప్రతీక్‌ భార్య అపర్ణయాదవ్‌ నిత్యం ప్రధాని మోదీని , యూపీ సీఎం యోగిని పొగుడుతూ ఉంటారు. ఇది అఖిలేశ్‌యాదవ్‌కు రాజకీయంగా ఎన్నోమార్లు ఇబ్బంది కలిగించింది. అయినా సవతి సోదరుడు ప్రతీక్‌తో అఖిలేశ్‌ మంచి సంబంధాలే కొనసాగించారు. ప్రతీక్‌యాదవ్‌కు రాజకీయాల మీద ఆసక్తి లేకపోవటంతో ఏ గొడవా రాలేదు.

సడెన్‌గా ప్రతీక్‌యాదవ్‌ తన భార్య నుంచి విడిపోతున్నట్టు ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టడంలో యూపీలో హాట్‌టాపిక్‌గా మారింది. అపర్ణ ఫ్యామిలీ డిస్ట్రాయర్‌ అంటూ ప్రతీక్‌ పోస్ట్‌ పెట్టాడు. కుటుంబం గురించి కాకుండా సొంత లాభం కోసం, పబ్లిసిటీ కోసం, పదవుల కోసం ఆలోచిస్తోందని భార్యపై విమర్శలు చేశాడు. మానసిక హింసను తట్టుకోలేకపోతున్నానని , అందుకే అపర్ణకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అపర్ణయాదవ్‌ ప్రస్తుతం యూపీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రతీక్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతుండగానే అపర్ణా యాదవ్ పీఏ అదంతా అబద్దమంటూ స్పందించాడు. ప్రతీక్ యాదవ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. భార్యాభర్తల మధ్య అలాంటి గొడవలేమీ లేవని వివరణ ఇచ్చాడు. కానీ అపర్ణయాదవ్‌ మాత్రం దీనిపై నోరుమెదపలేదు.

ఇక లాలూ కుటుంబంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫ్యామిలీలో తుఫాన్‌ను సృష్టించాయి. తేజస్వియాదవ్‌ తీరు నచ్చక చెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. లాలూ దంపతులు మాత్రం తేజస్వితో ఉండిపోయారు. రోహిణి ఆచార్య తన సోదరుడు తేజస్విపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందే కుటుంబం నుంచి వేరయ్యాడు లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌. సొంత పార్టీ పెట్టుకున్నా ఒక్క సీటు గెలవలేకపోయాడు. భార్య ఐశ్వర్యకు విడాకులు ఇవ్వకుండానే తేజ్‌ప్రతాప్‌ తన ప్రేయసి అనుష్కయాదవ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం లాలూ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.

లాలూకుటుంబం తనను ఇంటి నుంచి కొట్టి గెంటేసిందని పదేపదే ఆరోపించింది కోడలు ఐశ్వర్య. తన జీవితాన్ని తేజ్‌ప్రతాప్‌ సర్వనాశనం చేశాడని ఆరోపించింది. తన ప్రేమ వ్యవహారం బయటికొచ్చాకే తేజ్‌ప్రతాప్‌ కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచే తేజస్వియాదవ్‌ ఆయన్ని ఆర్జేడీ నుంచి దూరం పెట్టారు. చెల్లెళ్లు బయటికెళ్లాక సోదరుడిని దగ్గరికి తీసుకునే ప్రయత్నాల్లో తేజస్వి ఉన్నాడు. ఈమధ్య పండక్కి ఇద్దరు సోదరులు కలుసుకున్నారు. ఏదేమైనా దేశరాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన లాలూ , ములాయం కుటుంబాలు అంతర్గత కలహాలు, కూలిన కాపురాలతో జనం నోళ్లలో నానుతున్నాయి.

Share this post

submit to reddit
scroll to top