మార్చేద్దాం.. పాలనని కాదు పేర్లని!

cuddapah_1.jpg

అధికారం మారినప్పుడల్లా బోర్డుల అక్షరాలు మారిపోతున్నాయి. జాతీయస్థాయిలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో నగరాల పేర్లే మారిపోతున్నాయి.. ఇక మనమెంత? కూటమి ప్రభుత్వం పవర్లోకి రాగానే వైసీపీ హయాంలోని కొన్ని పేర్లు చెరిపేయడమే కాదు.. సవరణలు చేస్తూ మార్పు మంచికేనంటోంది. విపక్షమేమో ఇది మంచి పద్దతి కాదంటోంది.

విగ్రహమైనా, శిలాఫలకమైనా పదికాలాలపాటు అలాగే ఉండిపోతుంది. ఇక వీధి పేరయినా, ఊరిపేరయినా తరాలు మారినా జనం నోళ్లలో నానుతూనే ఉంటుంది. అందుకే తమ నాయకుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోవడానికి అదే పనిచేస్తుంటాయి కొన్ని ప్రభుత్వాలు. అయితే అధికారంతో పాటే ఆ పేర్లు కూడా మారిపోతుండటం వివాదాన్ని రాజేస్తోంది. మొన్న హెల్త్‌ యూనివర్సిటీ ..నిన్న కడప జిల్లా..తాజాగా విశాఖ క్రికెట్‌ స్టేడియం. ఇలా ప్రతిచోటా దివంగత నేత ముద్రని తొలగిస్తోంది ఏపీ ప్రభుత్వం.

పథకాలతో పాటు కట్టడాలు, ఊళ్లకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు తొలగించడంపై మండిపడుతోంది వైసీపీ. ఇటీవలే వైఎస్సార్‌ జిల్లా పేరుని వైఎస్సార్‌ కడప జిల్లాగా, వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో వైఎస్‌ఆర్‌ పేరు మాయమైంది. దీంతో విపక్షపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో అధికారం మారినప్పుడల్లా పేర్ల మార్పుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గతంలో విజయవాడ ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్‌ వర్సిటీగా మార్చింది. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. విశాఖ సీతకొండ హిల్‌వ్యూ పాయింట్‌కు గత వైసీపీ ప్రభుత్వం దివంగత నేత వైఎస్‌ పేరు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి అబ్దుల్ కలామ్‌ వ్యూ పాయింట్‌గా మార్చింది.

2019లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మార్చేసింది. జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో పథకాలను అమలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌, వైఎస్‌ఆర్‌ పేర్లతో ఉన్న పథకాలకు కొత్త పేర్లు పెట్టింది. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా.. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్రగా మార్చేసింది. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేశారు.

జగనన్న ఆణిముత్యాలును అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చేసింది కూటమి ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్చారు. జగనన్న విద్యాదీవెన ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మారిపోయింది. అలాగే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేరు కాస్తా ఎన్టీఆర్‌ ఆరోగ్య భరోసాగా మారింది. రాష్ట్రంలో వైఎస్‌ పేరు కనిపిస్తే కూటమికి భయం పుడుతోందని..అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడుతోంది వైసీపీ. అంతా తినేది ఆ గొంగట్లోనే. వెంట్రుకలేరుకుని ఏం లాభం?

Share this post

submit to reddit
scroll to top