అల్కహాల్..కూల్ డ్రింక్… బిర్యానీ కాదేదీ నమ్మించి గొంతుకోయడానికి అనర్హం.. ఇవన్నీ ఓలెక్క. ఆ మధ్య కేరళలో భార్యకు సైనైడ్ ఇచ్చి చంపిన సైలెంట్ కిల్లర్ నిర్వాకం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గూగుల్‌లో సెర్చ్ చేసి ఫారిన్ ఫార్ములాతో సైనైడ్‌ని అస్త్రంగా మలుచుకున్నాడు ఆ శాడిస్ట్. అదే స్టయిల్‌లో తెనాలిలో ముగ్గురు మహిళలు దారుణాలకు తెగించారు. అప్పులు ఎగ్గొట్టేందుకు, సాటి మహిళల నగలు దొంగిలించేందుకు సైనైడ్‌ని ఆయుధంగా చేసుకున్నారు. ఈజీ మనీ కోసం మరో ముగ్గురితో కలిపి కథ నడిపింది వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి. ఆమె తల్లి కూడా ఈ దారుణాల్లో పాత్రధారి. అప్పులు చేయడం, మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన పన్లేకుండా సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి చంపేయడం వీళ్ల నైజం.
తెనాలికి చెందిన నాగూర్‌బీ అనుమానాస్పద మృతి కేసులో కూపీలాగితే బయటపడింది వీళ్ల క్రైమ్ హిస్టరీ. నాగూర్‌బీని ఆటోలో తీసుకెళ్లి సైనైడ్ కలిపిన బ్రీజర్ తాగించి చంపేశారు. నాగూర్ బీ కన్పించడంలేదని ఆరా తీస్తే ఆటో డ్రైవర్ జాడ దొరికింది. అతన్ని విచారిస్తే బుజ్జి గ్యాంగ్ నిర్వాకాలు బయటపడ్డాయి. చార్టెడ్ అకౌంటెంట్ చేసిన బుజ్జి ఆ కోర్సును మిడిల్ డ్రాప్ చేసి సైనేడ్‌తో హత్యలు షురూ చేసింది. అత్తారింటి ఆస్తి కోసం ట్రయిల్స్ వేసి ఆ తరువాత ఇరుగుపొరుగు వాళ్లను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడినట్టు తేలింది. నెత్తురు చుక్క రాలకుండా.. చేతికి మట్టి అంటకుండా సైనేడ్‌తో హత్యలకు తెగబడ్డారు నిందితులు. వీళ్లు పట్టుబడకపోవడానికి కారణం ఇన్నాళ్లూ ఎవరికీ డౌట్ రాకపోవడమే.
సీఏ మిడిల్ డ్రాప్ చేసి కాంబోడియా వెళ్లొచ్చిన వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి ఈజీ మనీ కోసం ఇంత కిరాతక కథ నడిపింది. దొరికిపోయారుగానీ మరో ముగ్గురు వీరి చేతిలో చనిపోయి ఉండేవారే. ఇంతకీ వీళ్లకు సైనైడ్ ఎలా వచ్చిందని ఆరా తీస్తే మరో నిర్వాకం బయటపడింది. పందికొక్కుల కోసమని తన ఫ్రెండయిన బంగారు వ్యాపారి నుంచి సైనైడ్ తీసుకుని వీళ్లకు అమ్ముకున్నాడో ప్రబుద్ధుడు. జనారణ్యంలో మృగాల్లాంటి మనుషుల మధ్య బతుకుతున్నామని వీళ్లని చూస్తేనే తెలిసిపోవడం లేదూ!