కశ్మీర్‌ టూ ఛావా.. ఇలాగే చావాలా?

nagpoor.jpg

ఓ సిన్మా భావోద్వేగాలు రేపుతోంది. మతకల్లోలాలకు ఆజ్యంపోస్తోంది. భజరంగ్‌దళ్ నిరసనతో రాజుకున్న చిచ్చు నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ పెట్టేదాకా వెళ్లింది. ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో ఉద్రిక్తతకు కారణమైంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఉద్రిక్తత శతాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న నాగ్‌పూర్‌ని అతలాకుతలం చేస్తోంది. ఈ అల్లర్లకు సూత్రధారిగా భావిస్తున్న ఫయీంఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీపై పోటీ చేశారు. మరోవైపు అల్లర్లలో ప్రమేయం ఉన్న 100 మందిని పోలీసులు గుర్తించారు.

నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఉద్రిక్తతలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఔరంగజేబు సమాధి నేటి తరానికి సంబంధించినది కాదని తెలిపింది. సమాధి వివాదంపై అల్లర్లు సమాజానికి మంచిది కాదంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా సీరియస్‌ కామెంట్‌ చేశారు. ఛావా సిన్మాతో తలెత్తిన భావోద్వేగాలతోనే అల్లర్లు చెలరేగాయన్నారు. అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. ఛావా అద్భుతం, అందరూ చూడాలని ప్రమోట్‌ చేసింది కాషాయపార్టీ నేతలే!

ఛావా సినిమా భావోద్వేగాలు సిన్మా థియేటర్‌కే పరిమితం కాలేదు. బయట కూడా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. శంభాజీని ఔరంగజేబు చంపిన విధానం(సినిమాలోని దృశ్యాలు) మరాఠీ సమాజం రక్తం మరిగేలా చేసింది. అదెప్పుడో శతాబ్దాల క్రితం జరిగిందని సర్దుకుపోవడం లేదెవరూ. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ వివాదంగా మారింది. సమాధిని తొలగించాలని ఒక వర్గం.. ఆ చారిత్రక ప్రదేశాన్ని కాపాడాలని మరో వర్గం రోడ్డెక్కటం మరాఠా గడ్డపై కల్లోలానికి కారణమైంది.

బజరంగ్‌దళ్‌ నిరసనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని తగలబెట్టారన్న వదంతులతో పరిస్థితి అదుపు తప్పింది. ఔరంగజేబు స్మారకం దగ్గర భద్రతని కట్టుదిట్టం చేశారు. ఔరంగజేబు సమాధిని తీసేయాలనే డిమాండ్ మొదలైనప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య పెరిగింది. పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నా ఛావాలాంటి సిన్మాల ప్రభావం సమాజంలో విద్వేషాలకు కారణమవుతోంది. చరిత్రను తవ్వితీస్తామంటున్న పెద్దలు తమ వేలితో తమ కన్నే పొడుచుకునేలా ఉన్నారు.

Share this post

submit to reddit
scroll to top