తెలంగాణ గడ్డపై మళ్లీ మావోయిస్టులు

maoist-2-16384251543x2-1.jpg

తెలంగాణ ఆవిర్భవించాక అదే పెద్ద ఎన్‌కౌంటర్‌. పోలీసుల సక్సెస్‌ సంగతేమోగానీ రేవంత్‌ సర్కారుపై మావోయిస్టులు ఈ ఘటనతో గుర్రుమంటున్నారు. జిల్లా మంత్రులే బాధ్యత వహించాలంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎన్‌కౌంటర్‌తో 12 మంది సభ్యులున్న భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది.

లచ్చన్న బృందం దామెరతోగు, కరకగూడెం, గుండాల, తాడ్వాయి అడవుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో గోదావరిని దాటే ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘా పెట్టిన పోలీసులు మాటువేశారు. ముప్పును పసిగట్టిన మావోయిస్టులు తిరిగి ఛత్తీస్‌గఢ్‌ వెళ్లేందుకు ప్రయత్నించినా గోదావరివాగు ప్రవాహ ఉధృతితో సాధ్యం కాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ మావోయిస్టులకు కంచుకోట. దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకొని దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్‌ల ఏరివేతను ముమ్మరం చేయడంతో వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మరో సేఫ్‌జోన్‌ను వెతుక్కోవడంతో పాటు క్యాడర్‌ని రిక్రూట్‌ చేసుకునే పనిలో పడ్డారు మావోయిస్టులు.

అబూజ్‌మడ్‌ అడవుల్లో నిర్బంధం పెరగటంతో తెలంగాణలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించారు మావోయిస్టులు. ఈ క్రమంలో మణుగూరు ఏరియా కమిటీ బాధ్యతలను కుంజా వీరయ్య అలియాస్‌ లచ్చన్నకు అప్పగించినట్టు తెలుస్తోంది. గోదావరి దాటొచ్చి దండకారణ్యంలో షెల్టర్‌ తీసుకుంటున్న మావోయిస్టులను మొగ్గలోనే తుంచేయాలని భావిస్తోంది పోలీసుశాఖ. అదను చూసి కరకగూడెం అడవుల్లో తుపాకులు ఎక్కుపెట్టారు పోలీసులు. తెలంగాణలో షెల్టర్‌ ప్రాణాలతో చెలగాటమని ఈ ఎన్‌కౌంటర్‌తో సంకేతాలిచ్చారు. తెలంగాణలో మావోయిస్ట్‌ కార్యక్రమాలను ఉపేక్షించే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్ర హెచ్చరికలతో లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. విప్లవ ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలన్న హెచ్చరికతో తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది.

Share this post

submit to reddit
scroll to top