నో మేనేజ్‌.. ఓన్లీ డ్యామేజ్‌!

chandrababu-jail.jpg

వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారని అంతా ఆడిపోసుకుని ఆయనకి దిష్టి తగిలినట్లుంది. లాయర్లను మార్చినా, సుప్రీందాకా వెళ్లినా జైలుగోడలమధ్యే మగ్గాల్సి వస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌నుంచి ఎలా బయటపడాలో తెలీక రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిటిషన్ల మీద పిటిషన్లతో ఈ కేసు న్యాయస్థానాలకే పెద్ద పరీక్షపెడుతుంటే మరికొన్ని కేసులు టీడీపీ అధినేత మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే కోర్టుల్లో ఆ కేసులకు సంబంధించిన పిటిషన్లు లిస్ట్ కావడంతో ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు అనుభవానికే అగ్నిపరీక్షగా మారింది.

తన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండువారాలు గడిపేశారు ఆయన. ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబు వేసిన అన్ని పిటిషన్లలోనూ ఆయనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. ఆయన సుప్రీం గడప తొక్కగానే మరికొన్ని కేసులను సీఐడీ అధికారులు తిరగదోడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనేది ఓ అభియోగం. ఆ వ్యవహారంలో ఆయన ప్రత్యక్షపాత్ర ఉందని సీఐడీ అంటోంది. దీనికి సంబంధించి గతంలో నమోదైన కేసుల్లో విచారణ జరపాలంటూ ఇప్పటికే సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. అటు ఫైబర్ గ్రిడ్‌ అవకతవకలపైనా చంద్రబాబుని విచారించాల్సి ఉందని పీటీ వారెంట్ దాఖలైంది.

ఈ రెండు కేసుల్లో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ వాదిస్తుంటే.. రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. పిటి వారెంట్ పేరుతో కస్టోడియల్ ఎంక్వైరీకి ఇవ్వొద్దంటూ తమ వాదన వినిపిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు లాయర్లు సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంలో ఆయనకు ఊరట లభించినా బయటికొచ్చేలోపు పాతకేసుల్లో ఏదో ఒకటి మళ్లీ మెడకు బిగుసుకునేలా ఉంది. ఎన్నికలముందు వ్యూహాలకు పదునుపెట్టాల్సిన టైంలో చంద్రబాబు అండ్‌కోకి కేసులనుంచి బయటపడేందుకు ఏం చేయాలన్న ఆలోచనలతోనే పుణ్యకాలం గడిచిపోతోంది.

Share this post

submit to reddit
scroll to top