ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా ఎదగాలనే గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు అన్నదాతల కడుపుమంట చూడాలి. మన ఆకలితీర్చే రైతన్న బాగుండాలని కోరుకోవాలి. అంతా బాగుంటే, జీవితాలు పచ్చగా ఉంటే రైతులెందుకు రోడ్డెక్కుతారనే ఆలోచన చేయాలి. పంజాబ్-హర్యానా బోర్డర్ మళ్లీ భగ్గుమంటోంది. రైతులపై ఉక్కుపాదం మోపిన పోలీసులు వాళ్ల శిబిరాలను తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
రోడ్డుపై ఎవరు కనిపించినా తీసుకెళ్లి జైల్లో వేస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అటు రైతులు కూడా కేంద్రం దిగొచ్చేవరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. మణిపూర్‌లోనంటే ఉగ్రవాదం. కానీ ఇక్కడ రైతుల నినాదం. గుండెలోతుల్లోంచి పెల్లుబుకుతున్న ఆగ్రహం. ఒకటా రెండా పదమూడు నెలలుగా పంజాబ్-హర్యానా బోర్డర్‌లోని శంభు, ఖనౌరీలో కొనసాగుతోంది రైతుల నిరసన.
సాధ్యంకాని కోరికలేమీ కోరడం లేదు కష్టజీవులు. కనీస మద్దతు ధర చట్టం కోసం … నెలల తరబడి బోర్డర్‌లో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిగినా స్పందన లేకపోవటంతో రోజురోజుకూ నిరసనకారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు రైతు నిరసనలపై ఉక్కుపాదం మోపటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందంతో జరిగిన రైతుల చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.
ఎంతమందిని అరెస్ట్ చేసినా, నిలువ నీడలేకుండా శిబిరాల్ని తొలగించినా తమ పోరాటం ఆగదంటున్నారు రైతులు. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంతలా వేధించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న రెండు హైవేలు రైతుల ఆందోళనలతో ఏడాది కాలంగా మూసి ఉన్నాయి. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటోంది పంజాబ్ ప్రభుత్వం కూడా. ప్రజాస్వామ్యదేశంలో చర్చలతో సమస్య పరిష్కారం కానప్పుడు, రైతన్న వేదన అరణ్యరోదనగా మిగులుతున్నప్పుడు రోడ్డెక్కడం తప్ప మరో మార్గమేముంది?