పీతాంబరాలన్నీ పోయి ఒంటిమీద పీలికలే మిగిలినా కాంగ్రెస్ మారడం లేదు. మర్రిచెట్టు నీడన మొక్క మొలవదన్నట్లు బీజేపీ మహావృక్షంగా ఎదిగిపోతుంటే.. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోంది కాంగ్రెస్. తననెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకుంటోంది. ఓ పక్క బెంగళూరులో గోతుల రోడ్లు, గంటలతరబడి ట్రాఫిక్ ఇక్కట్లమీద పెద్దపెద్దోళ్లే ఉతికి ఆరేస్తుంటే.. కన్నడనాట సిద్దరామయ్య, డీకే శివకుమార్ కుర్చీ కోసం తన్నుకుంటున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంగా ఎవరుండాలో, ఎంతకాలం కొనసాగాలో హైకమాండ్ చేతుల్లో ఉంటుంది. కానీ స్వేచ్ఛ ఎక్కువైన కాంగ్రెస్‌లో అధిష్ఠానానికి ఆ ఆప్షన్ ఉండదు. అందుకే కర్నాటకలో అంత డ్రామా నడుస్తున్నా కాంగ్రెస్ పెద్దలు ఏమీ చేయలేక చోద్యంచూస్తున్నారు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోటాపోటీగా ఎమ్మెల్యేలకు విందులు ఏర్పాటు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. కళ్లముందు ఫైటింగ్ కనిపిస్తున్నా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సీఎం, డిప్యూటీ సీఎం డైలాగులు చెబుతున్నారు.
సీఎం పీఠం కోసం సిద్దరామయ్యతో కుస్తీ పడుతున్న వేళ డీకే శివకుమార్ విందుతో మరోసారి బలప్రదర్శనకు దిగారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేశారు. వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ డిన్నర్‌కు హాజరయ్యారు. కొందరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఒకరోజు ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇలాంటి డిన్నర్‌లోనే పాల్గొన్నారు.
సిద్దరామయ్య, డీకే విందుల్లో మునిగి తేలుతున్నారని తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ఈ విందులకు ప్రాధాన్యత లేదని కర్నాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తోన్న తరుణంలో ఈ బల ప్రదర్శనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండున్నరేళ్లు కాగానే డీకే శివకుమార్‌ను సీఎంని చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గతంలో హామీ లభించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానంటున్నారు సిద్దరామయ్య. నిండా మునిగాక చలేముందనుకుంటున్న హైకమాండ్.. 2026 ఫిబ్రవరి తరువాతే నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకునేలా ఉంది.





