మొన్నటిదాకా నీవు లేక నేను లేనంటూ డ్యూయట్లు పాడుకుని ఇప్పుడు వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా అంటూ ట్రాజెడీ సాంగ్ వినిస్తున్నారు. ఎప్పటికీ కలవని రెండు పట్టాలమంటూ అఫీషియల్‌గా తేల్చేశారు. మాకొద్దీ వివాహం.. అప్పుడే జీవితంలో దూసుకుపోతాం అంటున్నారు. అవును ఇట్స్ అఫీషియల్. ఇండియన్ క్రికెటర్ స్మృతి మందాన, పలాశ్ ముచ్చల్ వివాహం అధికారికంగా రద్దయింది.
కొన్నిరోజులుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ.. పెళ్లి రద్దు విషయాన్ని స్వయంగా స్మృతి మందాననే సోషల్ మీడియాలో కన్ఫమ్ చేసేసింది. పెళ్లిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. ఇకనైనా వాటికి ఫుల్స్టాప్ పడాలనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తున్నానన్నారు స్టార్ మహిళా క్రికెటర్. రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరారు. ఇక తన ఫోకస్ అంతా క్రికెట్ మీదే ఉండబోతోందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మందాన.
స్మృతి మందాన పోస్ట్ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చారు. మందానతో తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటికొచ్చి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు, ఇష్టంవచ్చినట్లు పుకార్లు సృష్టించేవారిపై లీగన్ యాక్షన్ తీసుకుంటానంటున్నాడు. మందాన, ముచ్చల్ వివాహం గ్రాండ్‌గా జరుగుతుందని అందరూ ఆశించారు. హల్దీ, బరాత్ వేడుకలూ ఓ రేంజ్లో జరిగాయి. ఇక కాసేపట్లో పెళ్లి అనగానే మందాన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో మ్యారేజ్ అగిపోయింది. మందాన తండ్రి అనారోగ్యం ఎపిసోడ్ తర్వాత ముచ్చల్ కూడా కాస్త సిక్ అయినట్లు వార్తలొచ్చాయి.
తెరవెనుక ఏం జరిగిందోగానీ పెళ్లి వద్దనే నిర్ణయం మదాన వైపు నుంచే వచ్చింది. ముచ్చల్ మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని వదంతులొచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లయ్యాక పెటాకులయ్యేకంటే కష్టమైనా నష్టమైనా ముందే చెప్పేయడం మంచిదనుకుంది మందాన. అందుకే మోగాల్సిన పెళ్లిబాజాలు మూగబోయాయి. ఇద్దరూ కొన్ని కారణాలతో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ఎనౌన్స్ చేసేశారు. కోడిగుడ్డుమీద ఈకలు పీకకుండా వదిలేస్తే వాళ్ల బతుకేదో వాళ్లు బతుకుతారు.





