జాతకమే మూఢనమ్మకం… ఆ ‘స్వామి’దేముంది?

venuswami.jpg

కొందరికి తేదీలు, అంకెలంటే నమ్మకం. మరికొందరు రాళ్లూ ఉంగరాలు జీవితాన్ని మార్చేస్తాయని నమ్ముతారు. ఇంకొందరు జాతకాలు నమ్ముతుంటారు. ఇక రాశిఫలాలూ గట్రా ఉండనే ఉంటాయి. జాతకాల్లో రకరకాలు. చిలకజోస్యం నుంచి హస్తసాముద్రికందాకా తిథులు నక్షత్రాల నుంచి పుట్టినతేదీలదాకా లెక్కేసి చెప్పేస్తుంటారు. నమ్మేవారు నమ్ముతుంటారు. అడిగి జాతకం చెప్పించుకుంటే అదో లెక్క. కానీ అడక్కుండానే ఎవరెవరి జాతకాలనో చెప్పేస్తేనే మన జాతకం తిరగబడుతుంటుంది. సెలబ్రిటీ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్‌ వేణుస్వామి పరిస్థితి ఇప్పుడు శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లే ఉంది.

ఎవరి సంసారం ఉంటుందో, ఎవరి సంసారం పెటాకులవుతుందో కూడా చెప్పేయడం వేణుస్వామి స్పెషాలిటీ. రాజకీయ నాయకుల తలరాతలు కూడా ఆయనే స్వతంత్రంగా రాసేస్తుంటారు. ఆయనమీద గురి ఉన్నవాళ్లే కాదు.. తలాతోకలేని జాతకాలంటూ గుర్రుమనేవారు కూడా ఉన్నారు. గ్రహబలం సరిగాలేదో, గ్రహాలన్నీ ఆయన కక్షగట్టాయోకానీ వేణుస్వామి ఒక్కసారిగా మీడియాకి టార్గెట్‌ అయ్యారు. టీవీ5 అయితే మరో టార్గెట్‌ లేనట్లు వేణుస్వామిని ఉతికారేస్తోంది. నిను వీడని నీడను నేనేనంటూ వెంటాడుతోంది. ఏపీలో రాజకీయం తారుమారయ్యాక టీడీపీకి జగన్‌ అండ్‌ కో టార్గెట్‌ అయింది. ఆ కోలో దురదృష్టవశాత్తూ వేణుస్వామి కూడా ఉన్నట్లుంది. జగన్ గెలుస్తాడనే వేణుస్వామి జోస్యాల వెనుక కూడా ఏదో కుట్ర ఉందనే ప్రచారానికి ఇప్పుడు ఆజ్యంపోసే పనిలో ఉంది ఎల్లో గ్యాంగ్‌.

వేణుస్వామికి మంత్రాలు చదవడం కూడా రాదంటూ టీవీ5 మూర్తి గాలితీసేశాడు. అసలు అతని జ్యోతిష్యానికి ప్రామాణికత ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఆ వర్గం జర్నలిస్టులు. వేణుస్వామినేమో ఉన్నచోట ఉండడాయ. అమెరికాలో ట్రంప్‌ ఓడిపోతాడని జోస్యం చెబుతాడు. ఇంకా పెళ్లి పీటలెక్కని నాగచైతన్య, శోభిత సంసారం ఎలా ఉంటుందోకూడా చెప్పేస్తాడు. ట్రంప్‌ ఖండించడు. అక్కినేని నాగార్జున బాధపడడు. నమ్మేవాడు నమ్ముతాడు. నమ్మకం లేనోడు ఇదేం పిచ్చితనమని పట్టించుకోడు. కానీ వేణుస్వామి జాతకాలు చెప్పడానికే వీల్లేదంటున్నారు కొందరు. చెబితే నాలిక కోసేస్తామన్నంత తీవ్రంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాని మిసెస్‌ వేణుస్వామిని కూడా ఈ రచ్చలోకి ఈడ్చారు.

కొన్ని ‘ప్రత్యేక వర్గాల’కు వేణుస్వామి ఇప్పుడు ఉమ్మడి శత్రువైపోయాడు. నాలుగువైపుల నుంచీ విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్న టైంలో.. వేణుస్వామి గొంతు పెగిలింది. తనను ఎవరు ఎందుకు టార్గెట్‌ చేశారో, వారి ఉద్దేశమేంటో చెబుతూ సంచలన ఆరోపణలు చేశాడు జాతకాలస్వామి. ఆయన ఆరోపణలు నిజమా కాదా అన్నది పక్కనపెడితే.. ఆయన్ని అంతగా టార్గెట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు కూడా కొందరి నుంచి వస్తున్నాయి. వేణుస్వామి దంపతులు ఆత్మహత్యే శరణ్యమనేంతగా ఎందుకు వేధించాల్సి వచ్చింది? మరో అంశమేదీ లేదన్నట్లు వేణుస్వామి లక్ష్యంగా సదరు టీవీ ఛానల్‌ డిబేట్లు పెట్టడం నైతికమేనా అన్నది మరో ప్రశ్న. పక్కాగా, ఓ పకడ్బందీ ప్రణాళికతోనే వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై వేణుస్వామి వ్యాఖ్యలకు మహిళా కమిషన్‌ నోటీసులివ్వడం మరో విచిత్రం. ఈ నోటీసులను వేణుస్వామి హైకోర్టులో సవాల్‌ చేశారు. జ్యోతిష్యాల పేరుతో అసత్య, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న ఆ జర్నలిస్టు 5కోట్లు డిమాండ్‌ చేశారని, ఇవ్వనందుకే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనేది వేణుస్వామి దంపతుల అభియోగం. తనపై అవినీతి ఆరోపణలుచేసిన వేణుస్వామి దంపతులపై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలంటూ టీవీ5 జర్నలిస్ట్‌ మూర్తి పోలీసులను ఆశ్రయించారు. చెప్పినోడికి చెప్పించుకున్నోడికి పరిమితం కావాల్సిన జాతకం ఇప్పుడో పబ్లిక్‌ ఇష్యూ అయి కూర్చుంది. గ్రహాలు అనుకూలంగా లేవని వేణుస్వామి తగ్గుతాడో.. ఈ పెంట మనకెందుకని ఇవతలివారే తగ్గుతారో చూడాలి మరి!

Share this post

submit to reddit
scroll to top