మోడీ సర్కారుకు టీడీపీ అవసరం లేకపోతే.. ఒంటరిగానే మెజార్టీ సీట్లు వచ్చుంటే ఇండియా మ్యాప్‌లో ఏపీ ఉందన్న విషయం కూడా గుర్తుకొచ్చేది కాదేమో. ఏపీ తలరాత బాగుండబట్టి పదేళ్లతర్వాత అనుకోకుండా ఇలా కలిసొచ్చింది. రాజధానికూడా లేకుండానే నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై ఇన్నాళ్లకు కేంద్రానికి కాస్త జాలికలిగింది. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండటంతో ఈసారి కాస్త పెద్దమనసు చేసుకుంది. రాజధాని, పోలవరంలాంటి వన్నీ పదేళ్ల తర్వాత కేంద్రానికి గుర్తుకొచ్చాయి. ఏపీలో పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టిస్తామంటోంది కేంద్రం. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్‌కి నిధులు కేటాయిస్తామన్న హామీ ఏపీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఉంది.
కొప్పర్తి, ఓర్వకల్‌కి ప్రత్యేక నిధుల హామీ ఏపీలో పారిశ్రామికరంగానికి తీపికబురు తెచ్చింది. పెద్ద, చిన్న పరిశ్రమలతో పాటు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతాలవైపు చూసేలా చేసిందీ ప్రకటన. 2007లో వైఎస్ హయాంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైంది. ఆ సమయంలో ఒకట్రెండు కంపెనీలు తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదు. గత ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు కేటాయించినా పెద్దగా పరిశ్రమలు రాలేదు. లేటెస్ట్‌గా కేంద్ర బడ్జెట్‌లో కొప్పర్తి అభివృద్దికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధుల హామీ ఇచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు. కొప్పర్తిలో పూర్తిస్థాయిలో పారిశ్రామికీకరణ జరిగితే లక్షపైచిలుకు ఉద్యోగాలొస్తాయి. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానయానానికి కూడా అనువుగా ఉండటం కొప్పర్తికి కలిసొచ్చే అంశం.
కర్నూలుజిల్లా ఓర్వకల్లుకి కూడా మహర్దశ పట్టబోతోంది. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామికవాడకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారి పక్కనే ఎయిర్‌పోర్ట్.. అలాగే ఓర్వకల్ మీదుగా రైల్వేలైన్ రాబోతుంది. పైగా ఈ ప్రాంతం హైదరాబాద్-బెంగళూరు మధ్యలో ఉండటంతో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 20వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో.. ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ జైరాజ్ విస్పాత్ స్టీల్‌ఫ్యాక్టరీ నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఓర్వకల్లుకి పారిశ్రామికంగా మంచిరోజులొస్తాయని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారు. కేంద్ర నిధులు, సహకారంపై వ్యూహాత్మకంగా వ్యవహరించి అనుకున్నది సాధించారనే టాక్ వినిపిస్తోంది.