ఇరాన్‌పై యుద్ధం.. సంక్షోభానికి మనం సిద్ధమా?

ChatGPT-Image-Mar-10-2026-09_50_14-PM-e1773159653101.png

రెస్టారెంట్లు మూసేస్తే శుభ్రంగా ఇళ్లలో వండుకుని తింటారని కేంద్రం అనుకుంటున్నట్లుంది. కానీ రేపు ఇళ్లలో వంటగ్యాస్‌ నిండుకుంటే మళ్లీ కట్టెల పొయ్యిలు వెలిగించాల్సిందే. అపార్ట్‌మెంట్లలో అయితే ఆ అవకాశం కూడా ఉండదేమో. ఇజ్రాయెల్‌కి వెళ్లి ఫాదర్‌ల్యాండ్‌ అని కొత్త బంధుత్వం కలుపుకున్నంత తేలికకాదు ఈసంక్షోభం నుంచి బయటపడటం. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన పదిరోజులకే భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉంది.

భారత్‌ ఒక్కటే కాదు.. పశ్చిమాసియా ఇంధనంపై ఆధారపడ్డ దేశాలన్నీ ప్రత్యక్షంగానే పరోక్షంగానో సంక్షోభంలో కూరుకుపోయేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ, కమోడిటీ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం చమురు, గ్యాస్ రంగాలకే కాకుండా భారత్‌లోని టెక్స్‌టైల్స్‌, మైనింగ్, స్టీల్ వంటి పరిశ్రమలపైనా కనిపిస్తోంది. కేవలం వారంలోనే 73 రకాల కమోడిటీల ధరలు పెరిగాయి. వాటిలో కొన్ని 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

భారత్ ఇప్పటికీ పశ్చిమాసియాపై ఆధారపడుతోంది. క్రూడాయిల్‌లో 50శాతానికి పైగా దిగుమతులే మనకు ఆధారం. ఎల్పీజీలో 50నుంచి 55శాతం అవసరాలు పశ్చిమాసియా దేశాల దిగుమతులతోనే తీరుతున్నాయి. ఇది పరోక్షంగా పాలిమర్లు, మెథనాల్, ఎరువుల సరఫరాను కూడా ప్రభావితం చేస్తోంది. టెక్స్‌టైల్స్‌ నుంచి పెయింట్‌, డైపర్ వరకూ ఈ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది.

పశ్చిమాసియా మార్కెట్‌పై ఆధారపడ్డ చాలా పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని ముఖ్యమైన కెమికల్ ధరలు భారీగా పెరిగాయి. వాటిపై ఆధారపడ్డ ఆటోమొబైల్, నిర్మాణ రంగాలపైనా ఇది దుష్ప్రభావం చూపుతోంది. టెక్స్‌టైల్‌ పరిశ్రమలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. డైయింగ్, బ్లీచింగ్, ఫినిషింగ్ వంటి ప్రక్రియలు ఎనర్జీపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రాసెసింగ్ ఖర్చులు పెరిగాయి.

టెక్ట్స్‌టైల్‌ రంగంలో విస్తృతంగా ఉపయోగించే సింథటిక్ ఫైబర్ పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ నుంచి తయారవుతుంది. దీని ధర ఇప్పటికే 15శాతం పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. టెక్ట్స్‌టైల్‌ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లో ఎక్కువగా ప్లాస్టిక్ మెటీరియల్స్ వాడతారు. ఇప్పుడా ధరలు రెండింతలు అయ్యాయి. క్యాష్‌ అండ్‌ క్యారీ డిమాండ్ తయారీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. గార్మెంట్స్‌లో ఉపయోగించే జిప్పర్లు, లేబుల్స్, బటన్ల ధరలు కూడా పెరిగాయి.

మైనింగ్ కార్యకలాపాల్లో భారీగా ఇంధన ఆధారిత యంత్రాలు వాడతారు. ఇంధన ధరలు పెరగడంతో ఖనిజ తవ్వకం, రవాణా ఖర్చులు పెరిగాయి.స్టీల్ తయారీలో ముఖ్యమైన ముడి పదార్థం కోకింగ్ కోల్. నౌకాయాన మార్గాల్లో అంతరాయంతో కోకింగ్ కోల్ సరఫరా దెబ్బతింది. మన దేశం ఏటా దాదాపుగా 57 మిలియన్‌ టన్నులకు పైగా కోకింగ్‌ కోల్‌ని దిగుమతి చేసుకుంటోంది. స్టీల్ రంగానికి అవసరమైన కోకింగ్ కోల్‌లో భారత్‌ 95శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.

 

Share this post

submit to reddit
scroll to top