పానీపూరి.. మిమ్మల్నే మింగేస్తుంది మరి!

panipoori.jpg

మరయంత్రంలా అతను ముంచి ప్లేట్‌లో పెడుతుంటాడు. జనం ఆబగా వాటిని గుటుక్కున మింగేస్తుంటారు. పానీపూరి తినడం చాలామందికి దైనందిన జీవితంలో అలవాటుకంటే ఓ వ్యసనంలా మారిపోయింది. కానీ పానీపూరిని గొంతులో వేసుకోవడమేమోగానీ.. అదెప్పుడో మిమ్మల్ని మింగేయడం ఖాయం. ఎందుకంటే పానీపూరిలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని తేలింది. మనిషి తినడానికి ఏమాత్రం పనికిరాని ఫుడ్‌ కలర్స్ పానీపూరిలో కలుపుతున్నారని కొన్ని శాంపిల్స్‌లో నిగ్గుతేలింది. అందుకే కర్నాటకలో పానీపూరిని బ్యాన్‌ చేయబోతున్నారు. చెన్నైలో కూడా దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు.

గోల్‌గప్పను గుటుక్కున మింగకపోతే కొందరికి ఆరోజు అసలేమీ తిన్నట్లే ఉండదు. పానీపూరిని గబగబా తింటుంటే ఆ మజానే వేరు. కొంచెం కొంచెం కొరుక్కుని తినే పదార్థంకాదది. అమాంతం నమిలి మింగేయాల్సిందే. గొంతులోంచి కడుపులోకి దిగేలోపే మరో పానీపూరి ప్లేట్‌లోకొచ్చేస్తుంది. ఎంతోమందికి ఇష్టమైన ఈ పానీపూరి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది. ఎక్కడయినా పానీపూరి బండి దగ్గరికెళ్తి చూస్తే పరిసరాలు ఏమాత్రం పరిశుభ్రంగా ఉండవు. ఎన్నిసార్లు చేతుల్ని బిందెలో ముంచి తీస్తాడో లెక్కే ఉండదు. ఇక ఆ పానీ తయారీకి ఏ నీళ్లు వాడతాడో ఎవరికి తెలుసు. ప్రమాదకర బ్యాక్టీరియాలు పానీపూరీలో జలకాలాడుతుంటే మైక్రోస్కోప్‌తో కనిపెట్టి రిపోర్ట్‌ ఇచ్చింది ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌. ఇలాంటి జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా ఎప్పట్నించో రోజూ తింటున్నాం.. ఇప్పటిదాకా ఏం కాలేదే అన్న కొంటెప్రశ్నలు వస్తుంటాయి. కానీ అది స్లోపాయిజన్‌లా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఎందరికి తెలుసు?

పానీపూరి ప్రేమికులకు షాక్‌ కొట్టే రిపోర్ట్ ఒకటి బయటికొచ్చింది. వాటిలో క్యాన్సర్‌కి దారితీసే పదార్థాలు, కలర్స్‌ వాడుతున్నారని తేలింది. అందుకే, కర్నాటకలో పానీపూరిని బ్యాన్‌ చేయాలన్న ఆలోచన చేస్తోంది అక్కడి ప్రభుత్వం. చెన్నైలోనూ కొన్ని శాంపిల్స్‌ తీశారు. అక్కడ వచ్చే రిపోర్టుని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. కర్నాటకలో 276 పానీపూరీ బండ్ల నుంచి శాంపిల్స్‌ తీస్తే.. 41 శాంపిల్స్‌లో ప్రమాదకారకాలు ఉన్నాయని తేలింది. మరో 18 శాంపిల్స్‌లో మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని కలర్స్‌, ఇతరత్రా మలినాలు ఉన్నాయని తెలిసింది. పానీపూరితో పాటు ఇచ్చే సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలోనూ క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు.

అవునా.. అయితే రెగ్యులర్‌గా వద్దులే అప్పుడప్పుడూ తిందామనుకున్నా తిప్పలు తప్పవు. పానీపూరీలోని పూరీ తయారీకి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. పైగా మైదా ఉపయోగిస్తారు. అక్కడి నుంచే మొదలవుతుంది అసలు సమస్య. అందుకే పానీపూరి అంటే ఎంత ఇష్టమున్నా.. కాస్త పరిశుభ్రత పాటించే దగ్గర, జిహ్వచాపల్యాన్ని చంపుకోవడమెందుకని ఎప్పుడన్నా ఓసారి తింటే సరి. రిస్క్‌ ఎందుకనుకుంటే పూర్తిగా మానేయడమే ఉత్తమం. అర్ధమవుతోందా? ఇదంతా మీ ఆరోగ్యాలగురించే!

 

Share this post

submit to reddit
scroll to top