ఆడలేక మద్దెలోడు అన్న సామెత అమెరికాకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. భారతీయ నిపుణులు లేకుండా దిగ్గజ టెక్ కంపెనీలు నడిచే పరిస్థితి లేకపోయినా మనమీద పడి ఏడుస్తూనే ఉంది అమెరికా. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక భారతీయ టెక్కీలపై ద్వేషం విద్వేషం పెరుగుతూనే ఉంది. ఉద్యోగాలకోసం వచ్చేవారిని కూడా అక్రమ వలసదారులంటూ అమెరికా ఆడిపోసుకుంటోంది. ఇప్పుడీ ఏడుపు గుళ్లూగోపురాలదాకా వచ్చింది.
అమెరికన్లకే అంత టాలెంట్ ఉంటే ఇండియానుంచి వెళ్లి కీలక హోదాలు దక్కించుకునే అవకాశమే ఉండదు. ఆ విషయాన్ని విస్మరించి మావాళ్ల కడుపులు కొడుతున్నారని ట్రంప్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు విషం చిమ్ముతున్నారు. హెచ్1 బీ వీసాల మాటున భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారట. మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ నోటినుంచి వచ్చిందీ విద్వేష డైలాగ్. ప్రపంచ వ్యాప్తంగా వీసా కార్టెల్ నడుస్తోందని, వారికి హైదరాబాద్‌లో ఒక వీసా టెంపుల్ ఉందని ఎరిక్ ష్మిల్ ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నాడు. మనవాళ్లు సెంటిమెంట్‌గా ఫీలయ్యే చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉద్దేశించి మిస్సౌరీ సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
వీసాల విషయంలో అంతర్జాతీయ మాఫియా నడుస్తోందంటున్నాడు సెనేటర్ ఎరిక్ ష్మిట్. ఈ వీసా కార్టెల్‌కు ఒక వీసాల దేవాలయం ఉంది. వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా పాస్‌పోర్టులకు ఆశీర్వాదం తీసుకుంటుంటారు అని ష్మిట్ తన కడుపుమంట బయటపెట్టుకున్నాడు. తన సోషల్‌మీడియా పోస్టులో చిలుకూరు బాలాజీ ఆలయం చిత్రాన్ని కూడా ఎటాచ్ చేశాడు. భారతీయులతోపాటు అమెరికా వీసాల కోసం వీసా కార్టెల్ ఈ ఆలయంలోనే పూజలు చేస్తుంటారని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. ఇప్పుడు బిలియన్ల డాలర్ల డబ్బు ఏఐ శిక్షణ కోసం భారత్‌కు వెళ్తోందని, అమెరికా దీనికి సబ్సిడీలు ఇస్తోందని మండిపడ్డారు.
మరో ట్వీట్లో భారతీయ విద్యార్థులపై ష్మిట్ అక్కసు వెళ్లగక్కాడు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీపడాల్సి వస్తోందనేది ష్మిట్ అంటున్నాడు. ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను వారు వీసా దరఖాస్తుదారులతో షేర్ చేసుకుంటారని మరో అభియోగం మోపాడు మిస్సౌరి సెనేటర్. భారతీయులు అడ్డదారులు ఉద్యోగాలు సాధిస్తుంటే.. పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లకు గేట్లు మూసేస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. ట్రంప్ జాత్యహంకారంతో విర్రవీగుతుంటే మిగిలినవారు కూడా ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.





