కొట్టుకుచస్తున్న థాయ్‌లాండ్‌-కంబోడియా

thailand-comodia-temple-war.jpg

ఇజ్రాయెల్‌-ఇరాన్‌. అంతకుముందు రష్యా ఉక్రెయిన్. థర్డ్ వరల్డ్‌వార్ సంకేతాలిస్తూ ఆగ్నేయాసియాలో మళ్లీ యుద్ధం కమ్ముకుంది. థాయ్‌లాండ్‌ -కంబోడియా దేశాలు తొడలు కొట్టడం మొదలైంది. ఆరంభమే అదిరిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య భగ్గుమన్న మంటకు కారణం ఒక పురాతన శివాలయం.

ప్రేర్ విహార్ టెంపుల్.. కంబోడియా సరిహద్దుల్లో 525 మీటర్ల ఎత్తులో.. ఖేమర్ సామ్రాజ్యం సమయంలో నిర్మించిన అత్యంత పురాతన దేవాలయం రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. ప్రహ్ విహార్ గుడి చుట్టూ ఉన్న నాలుగున్నర చదరపు కిలోమీటర్ల ప్రాంతం మీద ఆధిపత్యం కోసం రెండు దేశాలూ కొట్టుకు చస్తున్నాయి.

పర్యాటక స్వర్గధామంగా పేరున్న థాయ్‌ల్యాండ్‌కి, పొరుగు దేశం కంబోడియాకీ మధ్య పచ్చగడ్డి వేస్తే రాజుకుంటోంది. 817 కి.మీ సరిహద్దును పంచుకుంటున్న వీటి మధ్య ఎప్పుడూ ఏకాభిప్రాయం లేదు. వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా పెట్టిన ల్యాండ్ మైన్లు పేలి థాయ్‌ల్యాండ్ సైనికులు గాయపడటంతో మొదలైంది రగడ. పరస్పర కాల్పులు, గ్రనేడ్, రాకెట్ లాంఛర్ల ప్రయోగాల దాకా వెళ్లింది.

థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుకు సమీపంలోని డాంగ్రెక్ పర్వతాలపై వెయ్యేళ్ల కిందట నిర్మించిన పురాతన హిందూ ఆలయం ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు ఇతర హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే రెండు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. థాయ్‌లాండ్, కంబోడియా సైనికుల ఘర్షణలతో టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ఆలయం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న పట్టుదల యుద్ధానికి ఆజ్యం పోసింది.

ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ -కంబోడియా సైనికుల మధ్య కొన్నాళ్లక్రితం జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు చనిపోయాడు. అప్పటినుంచీ రెండు దేశాలూ సరిహద్దుల దగ్గర బలగాలను పెంచేశాయి. జూన్‌లో జరిగిన చర్చలు కొంత పురోగతిని సాధించినట్టు కనిపించినా, జులైలో తామున్ థోమ్ ఆలయం దగ్గర జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు మళ్లీ టెన్షన్లు పెంచేసింది.

ఏకంగా F-16 యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ థాయ్‌లాండ్‌కి గట్టి కౌంటరే ఇచ్చింది కంబోడియా. థాయ్‌లాండ్‌పై క్షిపణులను ప్రయోగించిన కంబోడియా 14 మంది థాయ్‌ పౌరుల ప్రాణాలు తీసింది. థాయ్‌లాండ్‌ బంకర్లను టార్గెట్‌ చేసి, గ్యాస్‌ స్టేషన్లను ధ్వంసం చేశాయి కంబోడియా మిస్సైళ్లు.

వెయ్యేళ్ల నాటి ఒక శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాల యుద్ధం ఇప్పుడు ప్రపంచ వార్తగా మారింది. కంబోడియా ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, థాయ్‌లాండ్ ద్వైపాక్షిక చర్చలకు ఓకే చెప్పినా తెగని ఆధిపత్య పోరాటానికి ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. గట్ల పంచాయతీ అంత తేలిగ్గా తెగదుమరి!

Share this post

submit to reddit
scroll to top