అనుచితమే.. కానీ అది ఆల్‌ ఫ్రీ స్టేట్‌!

tamilanadu-paeries-e1768891671835.jpg

ఫ్రీఫ్రీఫ్రీ.. ఉచిత వరాలకు కేరాఫ్‌గా పేరున్న తమిళనాట మళ్లీ ఫ్రీబీస్ జాతర మొదలైంది. గత ప్రభుత్వాలు మిక్సీలు, గ్రైండర్లు, కలర్‌టీవీలతో మొదలుపెట్టి, బస్సుల్లో లేడీస్‌కి ఫ్రీ జర్నీ దాకా తీసుకెళ్తే .. ఇప్పటి రాజకీయాలు పాత రికార్డుల్ని బద్దలుకొట్టేస్తున్నాయి. ఆడాళ్లకేనా.. మొగాళ్లు చేసిన పాపమేంటీ అంటూ పురుష పుంగవులకు కూడా బస్సుల్లో జీరోటిక్కెట్లు జారీ చేస్తామని మాటిచ్చింది అన్నాడీఎంకే. అమ్మ అడుగుజాడల్లోనే నడుస్తాం అంటూ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి రిలీజ్ చేసిన తాజా మేనిఫెస్టోలో ఒకటి కాదు ఐదు సర్‌ప్రైజులున్నాయి.

తమిళనాట మరో రెండుమూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. ఓటర్ల మూడ్‌ని తమవైపు తిప్పుకునేందుకు పిల్లిమొగ్గలేస్తున్నాయి ప్రధానపార్టీలు. మిగతా పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేసుకుని, ఎలక్షనీరింగ్ మొదలుపెడితే, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఏకంగా మేనిఫెస్టో విడుదల చేసి, ముందు వరుసలో నిలబడింది. ఎంజీఆర్‌ 109వ జయంతి సందర్భంగా రిలీజైన మేనిఫెస్టోలో జనరంజక హామీలు చాలానే ఉన్నాయి.

రేషన్‌ కార్డున్న ప్రతీ కుటుంబానికీ నెలకో రెండువేల ఆర్థిక సాయం, పట్నం మహిళలకు అపార్ట్‌మెంట్లు, ఆడపిల్లలకు సబ్సిడీపై టూవీలర్లు. అక్కడతోనే ఆగలేదు అన్నాడీఎంకే. మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీఇస్తోంది. ఇప్పుడున్న లేడీస్ ఫ్రీజర్నీ స్కీమ్‌ను టచ్ చెయ్యబోమంటూనే మగాళ్లు కూడా ఫ్రీగా బస్సుల్లో తిరిగేయొచ్చని బంపరాఫర్‌ ఇచ్చింది. మేం అధికారంలోకొస్తే, తమిళనాట సర్కారీ సిటీ బస్సుల్లో ఎవరైనా, ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు, రావచ్చు. అమ్మతోడు మాట తప్పం.. మడమ తిప్పం అంటున్నారు పళనిస్వామి.

ప్రజలు స్టాలిన్‌ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని, రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నాడీఎంకే ధీమాగా ఉంది. మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా అన్నాడీఎంకే మేనిఫెస్టోకు ఆమోదముద్ర పడినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే మేనిఫెస్టోను తలదన్నే రీతిలో ఉండాలంటే అధికార డీఎంకే కూడా మరో అడుగు ముందుకేసే తీరాలి. మగాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అనే మేజిక్‌ని స్టాలిన్ కూడా ఫాలో అవుతారా.. అంతకుమించిన మ్యాజిక్‌ మరేమన్నా చేస్తారా అన్నదే ఆసక్తికర అంశం.

తొలిసారి బరిలో దిగుతున్న విజయ్ పార్టీ టీవీకే కూడా మేనిఫెస్టో తయారీలో బిజీగా ఉంది. 12మందితో స్పెషల్ కమిటీ వేసి మరీ వరాల పట్టికను రూపొందిస్తోంది. ప్రతీ కుటుంబానికీ నిర్దిష్టమైన ఆదాయం, ఒక సొంతిల్లు, ఒక టూవీలర్ ఉండాలి. దీనికి నాదీ గ్యారంటీ అని ఇప్పటికే హీరో విజయ్ ప్రామిస్‌ చేశారు. ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా కామన్‌గా ఉండాల్సింది ఉండబోయేది ఫ్రీ బస్సు జర్నీ. లేదంటే అసలుకే మోసమొస్తుంది.

Share this post

submit to reddit
scroll to top