ఆ బిచ్చగాడున్నాడే.. బెగ్గింగ్‌ మహారాజ్‌!

Mangilal-Indore-Beggar.jpg

బిచ్చగాడు సినిమా గుర్తుందిగా. చెంపదెబ్బలు తింటాడు. అవమానాల పాలవుతుంటాడు. అయినా బిచ్చమెత్తుతూనే ఉంటాడు. రీల్‌ స్టోరీలో ఆ హీరో భిక్షాటన తల్లికోసం. కానీ రియల్‌ స్టోరీలో పైకి బిచ్చగాడి వేషం, లోపల జమిందారీ దర్పం. ఇండోర్‌లో ఓ బిచ్చగాడి కథ అచ్చం సినిమా స్టోరీని తలపిస్తోంది.

మేడలు, మిద్దెలు, కార్లు, షికార్లు. ఇదీ ఆ బెగ్గర్‌ బ్యాక్‌గ్రౌండ్‌. ఒక బిచ్చగాడు అంతటి లగ్జరీ లైఫ్‌ని ఎలా అనుభవిస్తున్నాడు. నిజంగా అందరిదగ్గరా చేయిచాస్తూ రూపాయి రూపాయి కూడబెట్టే అంత సంపదను సంపాదించాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కళ్లల్లో జీవం చచ్చుబడి.. కాటికి కాళ్లు చాపి….భవతీ భిక్షాందేహీ అంటూ చక్రాలబండిపై అతను తిరుగుతుంటే ఎవరికైనా జాలేస్తోంది. ఎంతోకొంత చేతిలో పెట్టాలనిపిస్తుంది.

కానీ సీన్ కట్ చేస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయం. ఇండోర్ నగరాన్ని నో బెగర్స్ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో 6,500 మందిని గుర్తించి, కౌన్సెలింగ్ ఇచ్చి, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈప్రక్రియలో భాగంగా చక్రాలబండిపై భిక్షాటన చేస్తున్న మంగీలాల్ అధికారుల కళ్లబడ్డాడు. దివ్యాంగుడైన మంగీలాల్‌ని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. కానీ అధికారులు అతని గురించి ఆరాతీస్తే షాకింగ్‌ నిజాలు బయటికొచ్చాయి.

➨ మంగీలాల్‌కు ఇండోర్‌లోనే మూడు మేడలు.

➨ అందులో  ఒకటి దివ్యాంగుడన్న కారణంతో రెడ్‌క్రాస్ సొసైటీ ఉచితంగా ఇచ్చింది.

➨ నమ్మలేని మరో నిజమేంటంటే బంగారం వ్యాపారులకే మంగీలాల్ వడ్డీలకు డబ్బులివ్వడం.

➨ మూడు ఆటోలు అద్దెకు తిప్పుతున్నాడు.

➨ కారు కూడా ఉంది. డ్రైవర్‌ను కూడా పెట్టుకున్నాడు.

ఇండోర్‌లో ఉంటే చక్రాల బండి. బయటికి వెళ్తే కారులో షికారు. ఇది మంగీలాల్ లైఫ్‌ స్టైల్. మంగీలాల్ బిచ్చగాడు కాదు.. పక్కా బిజినెస్ మేన్. మంగీలాల్ వ్యవహారం బయటపడటంతో ఇలాంటివాళ్లు ఇంకెవరన్నా ఉన్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. 6,500 మంది బిచ్చగాళ్లను గుర్తించిన అధికారులు…అందులో ఎంతమంది నిజంగా నిరుపేదలు? ఎంతమంది మంగీలాల్‌లా మాస్క్ వేసుకున్నవారనేదానిపై కూపీ లాగుతున్నారు. ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్టేంటంటే మంగీలాల్ మాత్రం తాను బిచ్చగాడిని కాదంటున్నాడు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే ఇల్లు కొన్నానంటున్నాడు. నిజమే.. చెమటోడ్చే సంపాదించి ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు!

Share this post

submit to reddit
scroll to top