ఈ ‘పున‌ర్జ‌న్మ‌’కి క‌దా AIని వాడాల్సింది!

tamilanadu-marriage.jpg

ఫేస్‌బుక్‌లోనే ప‌గ‌లూ రాత్రీ గ‌డిపేస్తున్నారు. ట్విట‌ర్‌, ఇన్‌స్టాలే జీవిత‌మ‌నుకుంటున్నారు. రీల్స్ పిచ్చితో సంసారాల్ని కూడా నాశ‌నం చేసుకుంటున్నారు. టెక్నాల‌జీని స‌ద్వినియోగం చేసుకోవాల్సింది పోయి దానికి వ్య‌స‌న‌ప‌రులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఏఐ యుగం వ‌చ్చేసింది. సృష్టికి ప్ర‌తిసృష్టి ఈ కృత్రిమ మేథ సొంతం. కానీ దాన్ని త‌ల‌లు మార్చ‌డానికి, మ‌న‌కు న‌చ్చ‌నివారిపై బుర‌ద చ‌ల్ల‌డానికి వాడేసుకుంటున్నాం. వెకిలి వీడియోల‌కు ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ని అడ్డ‌గోలుగా వాడేస్తున్నాం.

అందిపుచ్చుకుంటే అద్భుతాలు!

మూర్ఖుల మ‌న‌సు రంజింప‌రాద‌ని కొంద‌రికి ఎంత చెప్పినా వృథానే. ఆ మ‌ట్టిబుర్ర‌ల‌కు మంచీచెడ్డా అర్ధ‌మై చావ‌దు. కానీ అందివ‌చ్చిన సాంకేతిక‌త‌తో అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చు. మ‌న‌సుంటే మ‌రో ప్ర‌పంచాన్ని చూపించ‌వ‌చ్చు. అన్నింటికీ మించి మ‌న మ‌ధ్య లేని ఆత్మీయుల‌ను ఊహాప్ర‌పంచంలో సృష్టించ‌వ‌చ్చు. ర‌క్త‌సంబంధీకుల‌కు జీవిత‌కాలం మ‌రిచిపోలేని అనుభూతుల‌ను అందించ‌వ‌చ్చు. వివాహ వేడుక‌లో బంధుగ‌ణం అంతా ఉన్నా అల్లారుముద్దుగా పెంచిన నాన్న లేడ‌నే ఆ యువ‌తి లోటుని కృత్రిమ‌మేథ తీర్చింది.

ఆత్మీయులు, బంధుమిత్రులంతా చూస్తుండ‌గా పెళ్లిమండ‌పంలోని స్క్రీన్ మీద ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు సుబ్బ‌య్య‌. అంతే.. అంద‌రూ క‌లా నిజ‌మా అని చూస్తుండ‌గానే వేదిక‌పైకొచ్చి కూతురికి, త‌న బిడ్డ జీవితంలోకి ప్ర‌వేశించిన అల్లుడికి అక్షింత‌లేసి ఆశీర్వ‌దించాడు. అందులో ఆశ్చ‌ర్య‌మేముంద‌నుకుంటున్నారా.. ఆశ్చ‌ర్యం కాదు సంభ్ర‌మాశ్చ‌ర్యం. ఎందుకంటే కూతురి పెళ్ళిని క‌ళ్లారా చూసుకోడానికి ఆ తండ్రి బ‌తికిలేడు. మూడేళ్ల‌క్రిత‌మే క‌న్నుమూశాడు.

త‌మిళ‌నాడులోని తేని జిల్లాలో కృత్రిమ‌మేథతో సాధ్య‌మైందీ అసాధ్యం. సుబ్బ‌య్య చిన్న‌కూతురు రూపికాశ్రీ, కౌశిక్‌ల వివాహం కంబంలో జ‌రిగింది. వ‌ధువుకు తండ్రిలేని లోటును తీర్చేందుకు బంధువులైన యువ‌కులు ఏఐ సాయంతో సుబ్బ‌య్య ఇమేజ్‌తో వీడియోని రూపొందించారు. దాన్ని పెళ్లివేడుక‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ వీడియోని చూసిన వ‌ధువు కుటుంబీకులు, బంధువులు భావోద్వేగానికి గుర‌య్యారు.

Share this post

submit to reddit
scroll to top