అనుమానమేం లేదు.. పరువుతక్కువ పనే!

ai-summit-youth-congress-1.jpg

దేశం పరువు పోయింది. విదేశీ ప్రతినిధుల ముందు మనం తలదించుకోవాల్సింది పోయింది. చైనా డాగ్‌ రోబోట్‌కి తన లోగో అంటించుకున్న ఆ గల్గోటియాస్‌ యూనివర్సిటీ నిర్వాకం ఆతిథ్య దేశాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే ఢిల్లీ భారత్‌ మండప్‌లో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన ప్రపంచమంతా చర్యనీయాంశమైంది.

ఏఐ సమ్మిట్‌ వేదిక దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకున్న నిరసనకారుల బృందం ఒక్కసారిగా చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిరసనకు దిగింది. నినాదాలతో అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంది. మోదీ, ట్రంప్‌ చిత్రాలున్న టీషర్టులను రివర్స్‌లో ధరించి 5వ నెంబర్‌ హాల్‌లోకి ప్రవేశించిన కార్యకర్తలు వాటిని విప్పేసి బయటికి ప్రదర్శించారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగటంతో సమ్మిట్‌లో ఒక్కసారిగా గందరగోళం రేగింది.

ఢిల్లీ పోలీసులు కొందరిని అరెస్ట్‌ చేశారు. మిగిలినవారికోసం గాలిస్తున్నారు. నిరసనకు దిగింది యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలని గుర్తించారు. ఇప్పటిదాకా రాహుల్‌గాంధీ విదేశీ వేదికలపై భారత్‌ని బద్నాం చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తూ వచ్చింది. ఈసారి స్వదేశీవేదికపై విదేశీయుల ముందు ఆయన నాయకత్వంలోని పార్టీ కార్యకర్తలు దేశపరువు తీశారు. ఊహించని విధంగా నిరసనకు దిగిన కార్యకర్తలు అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రపంచ వేదికపై భారత్‌కు అపఖ్యాతిని తెచ్చేందుకే కాంగ్రెస్ కుట్రపూరిత చర్యలకు పాల్పడిందని బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

➧ ఏఐ సమ్మిట్‌ నిరసన వెనుక పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

➧ భారత్‌ గ్లోబల్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టారని వాదించారు.

➧ నేపాల్‌ జెన్‌G నిరసనల తరహాలోనే ఇది ఉందని అనుమానిస్తున్నారు.

15 వీడియో క్లిప్‌ల ఆధారంగా నిరసనకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేదిక దగ్గరే నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ వేదిక దగ్గరికి వాళ్లు ఎలా చేరుకున్నారు? అంతకుముందు ఎక్కడున్నారు? సమ్మిట్‌లో నిరసనకు ముందు వారు ఎవరితో ఫోన్లలో మాట్లాడారు? వాళ్లు ధరించిన టీ షర్టులు ఎక్కడ ప్రింటయ్యాయి.. వాటికి ఎవరు డబ్బు చెల్లించారనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వారంతటవారే ఈ పనిచేశారా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా అన్న కోణంలోనూ ఎంక్వయిరీ నడుస్తోంది.

ఇది పరువు తక్కువ కాదా!?

అంతకుముందు చైనా రోబోటిక్‌ డాగ్‌ని తన క్రియేషన్‌గా చెప్పుకుని దేశం పరువుతీసిన గల్గోటియాస్‌ యూనివర్సిటీని ఏఐ సదస్సునుంచి మెడపట్టి గెంటేశారు. ఓ ప్రొఫెసర్‌ అత్యుత్సాహం వల్లే ఇదంతా జరిగిందని ఆ యూనివర్సిటీ బుకాయిస్తోంది. థాలీ ఔర్‌ ఘంటీ అంటూ గతంలో ఆ యూనివర్సిటీ ప్రచురించిన ఓ వింత రీసెర్చ్‌ పేపర్‌ కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. కంచాలతో, గంటలతో చేసే శబ్దాలతో కరోనా వైరస్‌ నశిస్తుందనేది ఆ పరిశోధన సారాంశం. ప్రజలనుంచి విమర్శలతో తర్వాత నాలుక్కర్చుకున్నా అదెంత డకోటా యూనివర్సిటీనో అప్పుడే బయటపడింది. మరి అలాంటి యూనివర్సిటీ ఏఐ సదస్సులో భారత్‌ పరువు తీసేందుకు కారణమెవరో కూడా ఎంక్వయిరీ చేస్తే బావుంటుంది.

 

Share this post

submit to reddit
scroll to top