ఈ నయా నియంతతో ప్రపంచానికి ప్రమాదం!

us-ice-e1768370729849.png

బట్టలిప్పి బజార్న పడటం అంటారే. ట్రంప్‌ పరిస్థితి అలాగే ఉంది. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసి ఆ దేశ అధినేతను తానేనంటున్న ట్రంపరితనంతో అమెరికాలో విదేశీయులే కాదు, స్వదేశీయులు కూడా భయపడాల్సి వస్తోంది. కొత్త ఏడాది నుంచి అగ్రరాజ్యంలో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ట్రంప్ యంత్రాంగం తాజా నిర్ణయాలతో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) రెచ్చిపోతోంది. అనుమానమొస్తే ఎవరి ఇళ్లల్లోకైనా జొరబడుతున్నారు.

మినియాపోలిస్–సెయింట్ పాల్ ప్రాంతంలో సుమారు రెండు వేల మంది ఫెడరల్ ఏజెంట్లతో భారీ ఆపరేషన్‌ జరిగింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ICE ఆపరేషన్‌లలో ఇదొకటి. కేవలం సరిహద్దుల్లో జరిగే తనిఖీలాంటిది కాదు. అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, బిజినెస్ సెంటర్లు, షాపింగ్ ఏరియాలు దేనికీ మినహాయింపు లేదు. దీంతో ప్రజలు గడపదాటాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది.

2025లో ICE కస్టడీలో ఉన్న 32 మంది మరణించారు. ఇది గత 20 ఏళ్లలోనే అత్యధిక సంఖ్య. మెడికల్ ఎమర్జెన్సీలు, ఆత్మహత్యలు, కిక్కిరిసిన డిటెన్షన్ సెంటర్లు ఈ చావులకు కారణమయ్యాయి. 2025 చివరి నాటికి అమెరికాలో 68 వేల మందికి పైగా ICE డిటెన్షన్ సెంటర్లలో ఉన్నారు. వీరిలో దాదాపు 75 శాతం మందిపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవు. కేవలం ఇమ్మిగ్రేషన్ స్టేటస్ సరిగా లేదన్న కారణంతో వాళ్ల జీవితాలు జైలు పాలయ్యాయి. షాకింగ్ విషయం ఏంటంటే 9నెలల కాలంలో 170 సార్లు అమెరికన్ సిటిజన్లను కూడా ICE అదుపులోకి తీసుకుంది. అనుమానమొస్తే చాలు లోపలేస్తోంది.

ఇల్లీగల్ ఉంటున్నవారు భయపడుతున్నారంటే ఓ అర్ధముంది. కానీ అమెరికాలో లీగల్‌గా ఉన్నవాళ్లు, స్టూడెంట్స్ కూడా డేంజర్‌ జోన్‌ దినదినగండంగా బతకాల్సి వస్తోంది. వర్క్ పర్మిట్ల వ్యవహారాన్ని జటిలంగా మార్చేసింది ట్రంప్‌ ప్రభుత్వం. గతంలో ఉన్న 540 రోజుల ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ రూల్‌ని తొలగించింది. అంటే EAD రెన్యువల్ అప్లై చేసినా, అప్లికేషన్ ప్రాసెస్ అయ్యేలోపు ఉద్యోగం పోయే అవకాశం ఉంది. వేల మంది లీగల్ వర్కర్లు కూడా ఇప్పుడు ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నారు. విదేశీ విద్యార్థుల పరిస్థితయితే మరీ దారుణం.

కొత్తగా ట్రావెల్ బ్యాన్ భయం విద్యార్థులను వెంటాడుతోంది. అమెరికాలో ఉన్న స్టూడెంట్స్, స్కాలర్స్ దేశం బయటికి వెళ్తే తిరిగి రాగలుతారన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఈ కారణంగానే అనేక యూనివర్సిటీలు తమ స్టూడెంట్స్‌కు ఇప్పట్లో ప్రయాణాలొద్దని హెచ్చరికలు చేస్తున్నాయి.

 

Share this post

submit to reddit
scroll to top