ఆ వీక్‌నెస్‌తోనే డ్ర‌గ్ డాన్ ఖేల్ ఖ‌తం!

mexico-violence-mencho-e1771999915935.jpg

ఎంతవార‌లైనా కాంతాదాసులే. దండాలు పెట్టించుకునే నాయ‌కులు, శాల్యూట్‌లు కొట్టించుకునే అధికారులే కాదు ప్ర‌భుత్వాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన డ్ర‌గ్ డాన్లు కూడా ఆ బ‌ల‌హీన‌త‌కు అతీత‌మేమీ కాదు. క‌ర‌డుగ‌ట్టిన ఓ డ్ర‌గ్ డాన్ మ‌ర‌ణం మెక్సికోని కుదిపేస్తోంది. పోలీసులు అత‌న్ని కాల్చిచంప‌టంతో మెక్సికో అట్టుడికింది. మెక్సికో ఆర్మీ స్పెష‌ల్ ఆప‌రేష‌న్‌లో హ‌త‌మ‌య్యాడు డ్రగ్‌ డాన్‌ ఎల్‌ మెంచో. త‌న క‌ద‌లిక‌లు ఏమాత్రం బ‌య‌టికి పొక్క‌కుండా జాగ్ర‌త్త‌ప‌డే ఎల్ మెంచో పోలీసుల‌కు ఎలా చిక్కాడ‌న్న ఎంక్వ‌యిరీలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూస్తున్నాయి.

త‌న ప్రియురాలిని క‌లిసేందుకు ఎల్ మెంచో డెన్ నుంచి బ‌య‌టికొచ్చి పోలీసుల‌కు దొరికిపోయాడు. అమెరికా ఇంటెలిజెన్స్‌ సహకారంతో మెక్సికో ప్రత్యేక దళాలు చేపట్టిన మిషన్‌లో ఎల్‌ మెంచో తన సొంత రాష్ట్రం హలిస్కోలో ఉన్నట్లు స‌మాచారం అందింది. డ్రగ్‌ డాన్‌ ప్రియురాలికి న‌మ్మ‌క‌స్తుడైన అనుచరుడిపై మెక్సికన్ ఆర్మీ నిఘాపెట్టింది. ఆ అనుచరుడితో కలిసి ఆమె తపాల్పాలో డ్రగ్‌ కింగ్‌పిన్‌ని క‌లిసింద‌ని తెలియ‌గానే.. మిల‌ట‌రీ బ‌లగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

మోస్ట్‌వాంటెడ్ డ్ర‌గ్ డాన్ మెంచో

ప్రియురాలు వెళ్లిపోయిన తర్వాత ఎల్ మెంచో అక్క‌డే ఉన్న‌ట్లు ధృవీక‌రించుకున్న ప్రత్యేక దళాలు ఆపరేషన్ చేప‌ట్టాయి. ఎల్‌ మెంచో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి త‌నిఖీలు చేప‌ట్టింది మెక్సికో ఆర్మీ. డ్ర‌గ్ డాన్ పట్టణం విడిచి పారిపోకుండా ఆరు హెలికాప్టర్లు, అదనపు దళాలతో శివారు ప్రాంతాల్లో మోహరించింది. మెంచో తన ఇద్దరు బాడీగార్డులతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అండర్‌గ్రౌండ్‌లో నక్కిన అత‌నిపై భ‌ద్ర‌తాద‌ళాలు కాల్పులు జ‌రిపాయి. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఎల్ మెంచో ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపే ప్రాణాలు విడిచాడు.

ఎల్‌ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగువెరా సెర్వంటెస్‌. మెక్సికో ప్ర‌భుత్వానికి త‌ల్నొప్పిగా మారిన న్యూ జనరేషన్‌ కార్టెల్‌కు అత‌నే బాస్‌. గతంలో పోలీసుగా పనిచేసిన మెంచో తర్వాత డ్రగ్‌ మాఫియాలోకి మారాడు. 2009లో న్యూ జనరేషన్‌ కార్టెల్‌ను ఏర్పాటు చేశాడు. 2015లో 20 మందికి పైగా పోలీసులను మెంచో గ్యాంగ్ తలలు నరికి చంపేసింది. అజ్ఞాతంలో ఉంటున్న ఎల్ మెంచో తలపై అమెరికా రూ.136కోట్ల రివార్డును ప్రకటించింది.

భ‌ద్ర‌తా ద‌ళాల ఆపరేషన్‌లో దాదాపు మెంచోతో పాటు 62 మంది డ్రగ్స్‌ ముఠా సభ్యులు హతమ‌య్యారు. దీంతో రెచ్చిపోయిన అత‌ని గ్యాంగ్ ప్ర‌తీకార దాడులకు దిగి 25 మంది నేషనల్ గార్డ్స్‌ సభ్యులను హత‌మార్చింది. మెంచో అనుచ‌రులు ప‌దుల‌సంఖ్య‌లో వాహనాలను తగలబెట్టారు. రహదారుల్ని దిగ్బంధించి సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, బ్యాంకులకు నిప్పుపెట్టారు. భ‌ద్ర‌తాబ‌ల‌గాల ఆప‌రేష‌న్‌లో హ‌త‌మైన ఎల్ మెంచో కుమారుడు డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో అమెరికాలో జీవితఖైదు అనుభవిస్తున్నాడు.

Share this post

submit to reddit
scroll to top