క్రెడిట్‌ ఎవరికైనా.. విజయం ‘ఆమె’దే!

Womens-reservation-bill-upsc.jpg

నువ్వు ఇప్పుడు జబ్బలు చరుచుకుంటే సరిపోతుందా ఎప్పుడో 2010లోనే మేం రాజ్యసభలో ఆమోదించామంటుంది కాంగ్రెస్‌. క్రెడిట్‌ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంటే కుదరదంటున్నాయ్‌ విపక్షాలు. కానీ ఓ చారిత్రక బిల్లు ఇప్పటిదాకా ఎందుకు చట్టసభలో ఆమోదం పొందలేదో అన్ని రాజకీయపక్షాలు గుండెలమీద చేయివేసుకుని ఆలోచించుకోవాలి. పురుషాధిక్య సమాజంలో మగవాళ్లే మీసాలు మెలేస్తూ రాజకీయం చేయాలన్న అహంకారమే మహిళల్ని రాజ్యాధికారానికి దూరం పెట్టింది. ఇంకానా ఇకపై సాగదు ఇకపై చెల్లదని మహిళాలోకం గొంతెత్తిన సమయంలో అనివార్యంగా ఈబిల్లు ఉభయసభల ముందుకొచ్చింది.

అమ్మో మహిళలకు అన్ని సీట్లా అని లెక్కలేసుకుని రాజకీయం అప్పుడే గుండెలు బాదుకుంటోంది. రాజకీయం మేమేచేయాలనుకునే మగమహారాజులకు ఈ ఎన్నికలే ఆఖరు. 2029 ఎన్నికలనాటికి మహిళలకు వారి కోటా వారికి ఇవ్వాల్సిందే. అయితే స్థానికసంస్థల్లో మహిళలు గెలిచినా పురుషులే పెత్తనం చెలాయిస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మహిళ ఉన్నా ఆవిడగారి భర్తే ఛైర్మన్‌గా చెలామణి అవుతుంటారు. పంచాయితీ వార్డుమెంబర్లనుంచి కార్పొరేటర్లదాకా అన్నిచోట్లా ఇదే జరుగుతోంది. మహిళలకు ఇవ్వాలి కాబట్టి నోరులేనివారినో, నోరెత్తలేనివారినో ముందపెడతామంటే అది సాధికారిత కాబోదు. అన్ని రాజకీయపక్షాలు ఈవిషయంలో నిజాయితీ ప్రదర్శించాల్సిన సమయం వచ్చేసింది.

మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు కాబట్టి మేం మద్దతివ్వడం లేదంటోంది ఎంఐఎం. ఎస్సీలు, ఓబీసీలకు మహిళల కోటాలో రిజర్వేషన్‌ ఇవ్వాలన్నది కాంగ్రెస్‌ డిమాండ్‌. ఉమాభారతి లాంటి బీజేపీ నాయకురాలు కూడా ఓబీసీలకు రిజర్వేషన్‌ ఇవ్వాలనటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ రిజర్వేషన్‌ కంటితుడుపు కాకుండా మహిళా నాయకత్వం ఎదగాలంటే మన మనసులు విశాలం కావాలి. కుటుంబాన్ని ఓర్పుగా నేర్పుగా నెట్టుకొచ్చే మహిళలు చట్టసభల ప్రతినిధులైతే సమాజానికి మంచి జరుగుతుందన్న ఆలోచన ఎదగాలి. కేవలం కాగితాల్లోనో, నినాదంగానో మిగిలిపోతుందనుకున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టసభదాకా రావడమే కాదు సంపూర్ణ మెజారిటీతో నెగ్గాలి.

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే దేశ చరిత్రలోనే ఇదో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. స్త్రీ జాతికి ఈ ప్రజాస్వామ్య సౌధం ఇచ్చే గొప్ప బహుమతి అదే అవుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు అంటే మూడింట ఒక వంతు సీట్లలో మహిళలకే టికెట్లు ఇవ్వాలి. ప్రస్తుత లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. ఇది 15 శాతం కంటే తక్కువ. 2022 డిసెంబరు నాటికి రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం కూడా 14 శాతం మాత్రమే. చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో కనీసం 10శాతం మంది మహిళల ప్రాతినిధ్యం కూడా లేదు. దక్షిణాదిరాష్ట్రాలు ఈ విషయంలో మరీ వెనుకబడ్డాయి.

వాస్తవానికి 1996, 1998, 1999, 2008, 2010లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్ ముందుకొచ్చినా అనేక కారణాలతో వీగిపోయింది. గీతాముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 1996 నాటి బిల్లులో ఏడు అంశాలను ప్రతిపాదించింది. అందులో ఐదు అంశాలు యథావిథిగా 2008 నాటి బిల్లుల్లో పొందుపరిచారు. అయితే ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ అప్పట్లో బిల్లును వ్యతిరేకించాయి. ఇదే బిల్లు 2010లో పార్లమెంట్ ముందుకొస్తే చాలామంది ఎంపీలు వ్యతిరేకించారు. గందరగోళం మధ్య రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గినా లోక్‌సభలో మాత్రం బ్రేక్ పడింది. 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇన్నేళ్లకు మళ్లీ తెరపైకొచ్చింది.

Share this post

submit to reddit
scroll to top