కాంగ్రెస్‌ సునామీలో కొత్త మొహాలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు, రాజకీయ ఉద్ధండులు ఓటమిపాలైతే అనూహ్యంగా కొందరు యువనేతలకు అదృష్టం వరించింది. మొదటి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు యువనేతలు. వారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా కాంగ్రెస్‌నుంచి పోటీచేసిన వారే.

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని చిత్తుగా ఓడించిన యశస్వినిరెడ్డి వయసు 26 ఏళ్లు. డబుల్‌ హ్యాట్రిక్‌తో పాలకుర్తిలో పాతుకుపోయిన ఎర్రబెల్లిని కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన ఓ అమ్మాయి ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. వాస్తవంగా పాలకుర్తిలో మంత్రిపై ఎన్నారై ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారటంతో ఆమె కోడలు యశస్వినిరెడ్డిని నిలబెట్టింది. పాలకుర్తి సామ్రాజ్యంలో వేరెవరూ వేలు పెట్టలేరనుకున్న మంత్రి ఎర్రబెల్లికి తొలి ఓటమి రుచిచూపించింది పాతికేళ్ల యువతి.

మెదక్‌లో హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని ఓడించారు ఓయువ డాక్టర్‌. 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్‌రావుని పద్మా దేవేందర్‌రెడ్డిపై పోటీకి దించింది కాంగ్రెస్‌. కుర్రోడు ఎంత హడావుడిచేసినా విజయం తనదేననుకున్న బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంచనాలను దెబ్బకొట్టారు రోహిత్‌రావు. మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి హన్మతరావుకు, మెదక్‌నుంచి ఆయన తనయుడు రోహిత్‌రావుకు కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చింది. అయితే అనూహ్యంగా హన్మంతరావు ఓడిపోయినా, ఆయన తనయుడు మాత్రం మెదక్‌లోగెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో కూడా ఓ యువ మహిళా డాక్టర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై చిట్టెం పర్ణికారెడ్డి(30)ని కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా నిలబెట్టింది. ఆమె గతంలో నక్సల్స్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడమే అందరినీ ఆశ్చర్యపరిస్తే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ డాక్టర్‌ పర్ణికారెడ్డి తొలి ప్రయత్నంలోనే గెలిచారు.

ఖానాపూర్‌లో కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి గెలిచింది కాంగ్రెస్‌. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మా బొజ్జుపటేల్‌(37) గెలుపు కూడా అనూహ్యమే. పేద కుటుంబంనుంచి వచ్చి చిన్న ఉద్యోగంచేసుకుంటున్న ఈ గోండు యువకుడిని అస్త్రంగా ప్రయోగించింది కాంగ్రెస్‌. ఉద్యమనేపథ్యం, ప్రజాసేవ చేయాలన్న సంకల్పం బొజ్జు పటేల్‌ని గెలిపించి అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేశాయి.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత(38) ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని నెలలక్రితమే సాయన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన కూతురికే ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ ఇక్కడినుంచి గద్దర్‌ కూతురు వెన్నెలని బరిలోకి దించింది. బీజేపీనుంచి బలమైన అభ్యర్థి ఉండటంతో త్రిముఖపోటీలో చివరికి లాస్యనందిత గెలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్లలోనూ రాజకీయవారసుడే గెలిచాడు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్‌(47)కి ఈసారి టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. స్పైన్‌సర్జన్‌ అయిన డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ తనకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ని ఓడించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.

ఉమ్మడి నల్గొండజిల్లాలో రాజకీయ దురంధరుడిగా పేరున్న జానారెడ్డి తనయుడు కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి బదులు నాగార్జునసాగర్‌నుంచి పోటీచేసిన కుందూరు జైవీర్‌రెడ్డి(48) బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ని ఓడించారు.

Share this post

submit to reddit
scroll to top