ఆ యాక్సిడెంట్‌ వెనుక సంచలన నిజాలు

delhi-hit-and-run.jpg

బలుపు కార్లకు బ్రేకులు పడవు. ఎవరన్నా అడ్డొచ్చినా తొక్కేసుకుంటూ వెళ్లిపోవడమే. గతేడాది జరిగిన ఓ హిట్‌ అండ్ రన్ కేసులో కాస్త ఆలస్యంగా సంచలన నిజాలు బయటికొస్తున్నాయి.

2024 సెప్టెంబరు 24న మిట్టమధ్యాహ్నం ఢిల్లీ రింగ్ రోడ్ ఒక్కసారిగా రక్తంతో నిండిపోయింది. 50 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్డుపై, 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఒక BMW దూసుకొచ్చింది. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన కారు ఓ ప్రభుత్వ అధికారిపైకి దూసుకెళ్లింది. నవజోత్ సింగ్ తీవ్రగాయాలతో చనిపోయాడు. ఈఘటన జరిగిన రెండునెలలైనా, ఢిల్లీ వాసులు ఈవిషాదాన్ని మరిచిపోలేదు. ఇప్పుడీ కేసులో పోలీసులు చార్జ్‌షీట్‌ వేశారు.

ఢిల్లీ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసులు వేసిన చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు బయటకొచ్చాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఒక భయంకర నిజాన్ని బయటపెట్టింది. ప్రభుత్వాధికారి నవజోత్ సింగ్ అక్కడికక్కడే చనిపోలేదు. కనీసం 15 నిమిషాలు బతికే ఉన్నారు. అంటే సకాలంలో సహాయం అందితే ప్రాణాలతో బయటపడేవాడు. ప్రమాద స్థలం నుంచి AIIMS ట్రామా సెంటర్ కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. అది కాకుంటే ఢిల్లీ కంటోన్మెంట్ హాస్పిటల్ కూడా దగ్గర్లోనే ఉంది. కానీ ఎవ్వరూ నవజ్యోత్ సింగ్‌కు తక్షణ సహాయం అందించలేదు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లేసరికి ఆలస్యమైపోయింది.

వాస్తవానికి ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. కానీ ప్రమాదానికి కారకురాలైన నిందితురాలు అంబులెన్స్ సహాయం వద్దంది. బాధితుడు చనిపోతాడని తెలిసినా, వైద్య సహాయం అందించాలన్న స్పృహలేకుండా తనకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ హాస్పిటల్ యాక్సిడెంట్ స్పాట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా గగన్‌ప్రీత్‌ రక్తమోడుతున్న నవజ్యోత్‌ని అక్కడికే తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందకే బాధితుడు చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ చెబుతోంది.

కథ అంతటితో అయిపోలేదు. కేసునుంచి తప్పించుకునేందుకు గగన్‌ప్రీత్ డ్రామా నడిపింది. తెలిసిన హాస్పిటలే కావడంతో పెద్దగా గాయాలేమీ కాకపోయినా ఐసీయూలో అడ్మిట్ అయింది. అంతేకాదు ఆస్పత్రి రికార్డుల్లో కూడా మార్పులు జరిగినట్లు, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావటంతో.. ఇప్పుడీ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు 400 పేజీల చార్జిషీట్‌ని కోర్టుకు సమర్పించారు.

 

Share this post

submit to reddit
scroll to top