కర్నాటకలో రూ.400 కోట్ల విలువైన పాత రూ.2వేల నోట్ల కంటైనర్ దొంగతనం కేసులో కీలక మలుపుచోటు చేసుకుంది. ఇంటర్-స్టేట్ దోపిడీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. సిట్ దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుండటంతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
కర్నాటకలో రూ.400 కోట్ల కరెన్సీ దోపిడీలో విరాట్ గాంధీ అనే మరో నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది. జనవరి 23న అర్ధరాత్రి విరాట్ గాంధీ అనే హవాలా ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఇప్పటిదాకా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది సిట్. థానేకు చెందిన ప్రముఖ బిల్డర్ కిషోర్ సావ్లా, అజార్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.
పోలీసులకు దొరికిన విరాట్ గాంధీ రాజస్థాన్‌కు చెందిన హవాలా ఆపరేటర్. అతనికి ఒక మత సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. నాసిక్ పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు సంయుక్తంగా చేస్తున్న దర్యాప్తులో రోజుకో సంచలనం బయటపడుతోంది.
2025 అక్టోబర్‌లో గోవా నుంచి కర్నాటకలోని ఓ ఆశ్రమానికి రెండు ట్రక్ కంటైనర్లలో రూ.400 కోట్లకు పైగా విలువైన పాత రూ.2వేల నోట్లు తరలిస్తున్నారు. అయితే కంటైనర్లు కర్ణాటకలోని చోర్లా ఘాట్ దగ్గరకు రాగానే దోపిడీ జరిగింది. దోపిడీగా చిత్రీకరించి డబ్బును దారి మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో హవాలా నెట్‌వర్క్, బిల్డర్లు, మత సంస్థల లింకులు బయట పడుతుండటంతో జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది.
పాత నోట్లను గోవా–కర్నాటక సరిహద్దునుంచి అహ్మదాబాద్‌లోని ఒక ఆశ్రమానికి తరలించి, అక్కడ వాటిని మార్చేందుకు 60:40 పర్సెంటేజీకి డీల్ కూడా కుదిరినట్లు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును రాబోయే ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 1న సందీప్ పాటిల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఫిర్యాదు చేయడంతో పాతనోట్ల వ్యవహారం బయటపడింది





