కుక్క మనిషిని కరిస్తే నో కేస్. కానీ మనిషి కుక్కను చంపేస్తే జైల్లో పడేస్తారు. అంటే కుక్క కరిచినా కిక్కురుమనకుండా ఉండాలా? పసిపిల్లలతో సహా అందరినీ కండలు పీకేస్తున్నా, పిక్కలు కొరికేస్తున్నా కామ్‌గా ఉండాలా అనేది కామన్‌మ్యాన్ డౌట్. ఆమధ్య పంచాయతీ ఎన్నికల్లో రోడ్లేయమనో, వీధిదీపాలు లేవనో సమస్యలు చెప్పుకోలేదు. చాలాచోట్లే గ్రామ సింహాలదే ప్రధాన సమస్య. అందుకే ఇచ్చిన హామీలు నిబెట్టుకోవడం కోసం అత్యుత్సాహంతో కొందరు శునకాల సామూహిక వధ చేపట్టారు.
కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో దాదాపు ఏడెనిమిది వందల కుక్కల్ని రాత్రికి రాత్రి లేపేసి పూడ్చేసిన ఘటన మూగజీవాల ప్రేమికుల గుండెల్ని పిండేసింది. వీధికుక్కలను చంపెయ్యడంపై రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ లాంటి సెలబ్రిటీలు మండిపడుతున్నారు. దీంతో కుక్కలు ముఖ్యమా.. మనుషుల భద్రత ముఖ్యమా అన్న డిబేట్‌పై పెద్ద ఫైటింగే నడుస్తోంది. మూగజీవాలని వదిలేస్తే మీదపడి కరిచేస్తుంటే ఏం చేయాలనే ప్రశ్న సహజంగానే వస్తోంది.
వీధి కుక్కలు కరుస్తాయి. కంగారు పెడతాయి. సింగిల్‌గా కనిపిస్తే రౌండ్ చేస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి. ఇది ఓ ఊరికో, పట్టణానికో పరిమితం కాలేదు. కుక్కల సమస్య దేశమంతా ఉన్నదే. అందుకే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపై ఓపక్క చర్చ జరుగుతుండగానే.. తెలంగాణలో కొన్నిచోట్ల శునకాల సమస్యపై పంచాయతీలు మరో మార్గం వెతికాయి. వందల కుక్కలను చంపి పాతేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో కుక్కల సమస్యయితే తీవ్రంగా ఉంది. వాటి నుంచి ప్రజల్ని రక్షించాల్సిందే. కానీ వాటిని చంపేయడమే పరిష్కారమనుకుంటే అది ఆటవికమే అవుతుంది. వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్కకాటుతో వృద్ధులు, చిన్నారులు చనిపోయినా, గాయపడినా అందుకు కుక్క యజమానిదే బాధ్యతని సుప్రీం స్పష్టం చేసింది. కుక్కకాట్లతో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది. జంతు ప్రేమికులు , డాగ్ లవర్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వందలాది వీధి కుక్కలను చంపిన ఘటనపై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్క కాట్లతో చనిపోయిన మనుషుల ప్రాణాలకే విలువా? ఇతర సంఘటనల్లో చనిపోయినవారి గురించి ఎందుకు మాట్లాడరనేది ఆమె క్వశ్చన్.
దోమలతో మనుషులు పోతున్నారు. పరిశుభ్రమైన నీళ్లు లేక ప్రాణాలు పోతున్నాయి. సకాలంలో వైద్యం అందక కొందరు చనిపోతున్నారు. భద్రతా ప్రమాణాలు లేక వేలప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో గాల్లో కలుస్తున్నాయి. సమాజంలో మనుషులకు ఇన్ని సవాళ్లుంటే కేవలం కుక్కలే విలన్లుగా కనిపిస్తున్నాయా అనేది రేణుదేశాయ్ ఆగ్రహంలోని అంతరార్థం.
నిజమే.. మా తాలూకా అని ఎవరూ అడ్డుపడరుకాబట్టి కుక్కల్ని చంపేస్తున్నారు. మరి వ్యవస్థలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యాన్ని, బాధ్యతరాహిత్యాన్ని బోనులో నిలబెట్టే దమ్ముందా మనకు?





