కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్‌కి SONస్ట్రోక్‌

bandi-with-pm.jpg

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో సుపుత్ర స‌మేతంగా బండి సంజ‌య్‌

తెలంగాణ బీజేపీలో తక్కువ కాలంలో కౌన్సిలర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారు బండి సంజ‌య్‌. శాంతి భద్రతల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు చూస్తున్న బండి సంజయ్ ఏ మాత్రం పొరపాటు చేయడనుకున్నారు. కానీ కొడుకును వెన‌కేసుకొచ్చి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తునే ఆయ‌న ప్ర‌మాదంలోకి నెట్టేశారు. కేసు ఫైల్ కాగానే కొడుకును సరెండర్ చేసి ఉంటే ఇంత ర‌చ్చ‌య్యేది కాదు. దేశ‌మంతా ఇంత చ‌ర్చ జ‌రిగేది కాదు. పోక్సో కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు హ‌నీట్రాప్ వాద‌న తెర‌పైకి తేవ‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత సున్నితంగా మారిపోయింది.

కేసు న‌మోదు కాగానే బండి భగీర‌థ్‌ని లొంగిపోయేలా చేసుంటే పోలీసులు మొదట్లో పెట్టిన పోక్సో లెవెన్ ప్రకారం స్టేషన్ బెయిల్‌ వచ్చేది. కుమారుడైనా చట్టాన్ని గౌరవించారనే పేరొచ్చి ఉండేది. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ కొడుకుని దాచిపెట్ట‌టం, చివ‌రికి లుకౌట్ నోటీస్ దాకా రావ‌డం, పోలీసులు కేంద్ర‌మంత్రి ఇంటిలో త‌నిఖీలు చేప‌ట్టాల్సి రావ‌టంతో బండి సంజ‌య్ ప్ర‌తిష్ట పాతాళానికి ప‌డిపోయింది. కేంద్ర‌మంత్రి కొడుకు భ‌గీర‌థ్‌పై మ‌రిన్ని క‌ఠిన‌మైన సెక్ష‌న్లు పెట్టాల్సి రావ‌టంతో కేసు మ‌రింత బ‌లంగా మారింది. చివ‌రికి కేంద్ర‌మంత్రి కొడుకు రిమాండ్‌కి వెళ్లాల్సి వ‌చ్చింది. బెయిల్ దొరుకుతుందని లాయర్లు చెప్పిన మాటలు వినడం వల్లే జాప్యం జరిగిందని అని స్వ‌యంగా కేంద్ర‌మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటన ఆయ‌న్ని మ‌రిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

బండి భగీరథ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లితో కలిసి పేట్‌బ‌షీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికతోపాటు ఆమె తల్లి కొన్ని గంటలు ఎదురుచూశాకే పోలీసులు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం 11 కింద కేసు నమోదు చేశారు. ఇక్కడినుంచే బండి సంజ‌య్ సెల్ఫ్ గోల్స్ మొద‌ల‌య్యాయి. తప్పు చేసిన కొడుకును పోలీసులకు అప్పగించాల్సింది పోయి బాధితురాలిపై హనీ ట్రాప్ కేసు పెట్టించారు. బాలికతో తనకు పరిచయం ఉందని, ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లానని, గుళ్లూ గోపురాలకు తిరిగానని భగీరథ త‌నే స్వ‌యంగా ఒప్పుకోవ‌డంతో త‌నెవ‌రో తెలీద‌ని త‌ప్పించుకునే అవ‌కాశం లేకుండాపోయింది.

ఢిల్లీ నిర్భయ కేసు త‌ర్వాత అప్పటి యూపీఎ సర్కార్ పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. పోక్సో అనేది 18 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలను లైంగిక వేధింపులు, లైంగిక దాడుల నుండి రక్షించడానికి రూపొందించిన సమగ్రమైన చట్టం. 2012లో రూపొందించిన ఈ చ‌ట్టం అదే ఏడాది నవంబరు 14న బాల‌ల దినోత్స‌వం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈకేసులో నిందితుల‌కు నేరం తీవ్రతను బట్టి కనీసం 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగ‌స్టు 6న చేసిన చట్ట సవరణతో పోక్సో చట్టం మరింత కఠినతర‌మైంది. ఈ చట్టంలో నేరం చేసిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా కేసు నమోద‌వుతుంది.

కేంద్ర‌మంత్రి కొడుకుపై కేసు విష‌యంలో పోలీసులు విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డాల్సి వ‌చ్చింది. దీంతో చివ‌రికి పోక్సో 6 సెక్షన్‌కు ఆల్టర్‌ చేయడం భగీరథ మెడకు చుట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సిట్ వేసి విచారణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించింది. బాధితురాలి స్టేట్​ మెంట్ ఆధారంగా మొదట పెట్టిన కేసును పోక్సో సెక్షన్ 6 గా మార్చారు. త‌ప్పుచేస్తే త‌న కొడుకునైనా ఉపేక్షించేది లేద‌నేవ‌ర‌కే కేంద్ర‌మంత్రి ప‌రిమిత‌మై ఉంటే హుంద‌గా ఉండేది. తన కుటుంబం జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని.. నిప్పు రవ్వగా మారి వారిని దహించేస్తాన‌ని హెచ్చ‌రించి కొత్త క‌ష్టాలు కొనితెచ్చుకున్నారు.

చివ‌రికి ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌తో మ‌రో దారిలేక కొడుకు బండి భ‌గీర‌థ్‌ని లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. రెండు గంటల పాటు పోలీసులు విచారించి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి బండి భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించ‌టంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పోక్సో చట్టం ప్రకారం నేరం చేసినా, చేసినవారికి సహకరించినా అదే కేసులో నిందితుడిగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కొడుకు పోలీసులకు లొంగిపోయిన సమయంలో బండి సంజయ్ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం ఆయనకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. నిందితునికి సహకరించారని బండి పై కూడా కేసు నమోద‌య్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. దేశ‌మంతా చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ కేసుతో బండి సంజ‌య్ మంత్రి ప‌ద‌వి ఉంటుందా ఊడుతుందా అన్న చ‌ర్చ కూడా మొద‌లైంది.

Share this post

submit to reddit
scroll to top