అయోధ్య‌ను కుదిపేస్తున్న విరాళాల చోరీ

auodhyaa-e1783343563128.png

అయోధ్య రామాల‌యంలో విరాళాల చోరీ ఘటన‌కు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌రాయ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ట్రస్ట్‌ సమావేశంలో ఆమోదించారు. మరోవైపు కొత్త ప్రధాన కార్యదర్శిగా విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన సీనియర్‌ నేత బజరంగ్ బాగ్రాను నియమించాల‌ని నిర్ణ‌యించారు. అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో చంపత్‌ రాయ్‌ డ్రైవర్ సహా ఎనిమిది మంది అరెస్ట‌య్యారు. ఆలయంలో విరాళాల చోరీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు క్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్ నృత్య గోపాల్ దాస్.

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు ప్రస్తుతం క్రిమినల్ ఎంక్వ‌యిరీకే పరిమితం కాకుండా నగర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయి. గత రెండేళ్లుగా రామాలయం చుట్టూ అభివృద్ధి చెందిన పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు విరాళాల చోరీ వివాదంతో మందగిస్తోంది. గ‌తంతో పోలిస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భ‌క్తితో స‌మ‌ర్పించిన కానుక‌లు, విరాళాలు దారిమ‌ళ్ల‌టంతో భ‌క్తుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. రామాలయం పరిసర ప్రాంతాలే కాకుండా హనుమాన్ గఢీ, కనక్ భవన్ వంటి ప్రముఖ ఆలయాల ద‌గ్గ‌ర కూడా భక్తుల రద్దీ తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.

విరాళాల వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత తమ వ్యాపారం స‌గానికి సగం ప‌డిపోయింద‌ని ఫ్లో ఆఫ్ సరయూ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న నిఖిల్ సింగ్ చెబుతున్నారు. పోయినేడాది ఇదే సమయంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చే ప్రతి కస్టమర్ ఈ వివాదం గురించే మాట్లాడుతున్నాడ‌ని అంటున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి కుటుంబంతో ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఓ భ‌క్తుడు ఈసారి ఆలయ హుండీలో విరాళం వేయలేదని చెప్పారు. ఇంత‌కుముందు వ‌చ్చిన ప్ర‌తీసారీ విరాళం సమర్పించేవాళ్లు. కానీ ఇప్పుడు త‌మ‌ కష్టార్జిత డబ్బు నిజంగా ఆలయానికే చేరుతుందా అనే సందేహంతోనే ఈసారి హుండీలో వేయ‌లేదంటున్నారు. శ్రీరాముడిపై విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని, అయితే నగదు విరాళాల విష‌యంలో మాత్రం ఆలోచిస్తున్నామని కొంద‌రు భ‌క్తులు అంటున్నారు.

రామాలయం పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులను తీసుకెళ్లే ఈ-రిక్షా డ్రైవర్లు కూడా ఆదాయం గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. అయోధ్య నగరంలోని పలువురు చిన్న వ్యాపారులు, రవాణా రంగానికి చెందినవారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2024 జనవరిలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, రవాణా సేవలు, చిన్న వ్యాపారాలు విస్తరించాయి. ప్రస్తుతం వేలాది కుటుంబాలు ఆలయ పర్యాటకంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఘటన ఆలయ ప్రతిష్ఠపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అయోధ్యకు భక్తుల రాక కొనసాగుతున్నా, ప్రార్థనలు యథావిధిగా జరుగుతున్నా, రామాలయ ప్రారంభం తర్వాత తొలిసారిగా విరాళాల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో భక్తుల విశ్వాసంతో పాటు అయోధ్య ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Share this post

submit to reddit
scroll to top