తిన్నది కక్కిస్తారనా? ఊచలు లెక్కపెట్టిస్తారనా?

neeravmodi.jpg

భారతీయ బ్యాంకులకు టోపీపెట్టి లండన్‌లో వాలిపోయిన నీరవ్ మోదీ తిరిగి రానంటే రానంటున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో మనదేశానికి తీసుకొచ్చి బెండు తీసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. చేతికి అందినట్లే అంది చేపలా జారిపోతున్నాడు నీరవ్‌ మోదీ. రేపోమాపో వస్తాడనుకున్న టైమ్‌లో భారత్‌కు అప్పగించొద్దంటూ నీరవ్‌మోదీ పదకొండోసారి యూకే కోర్టు కాళ్లు పట్టుకోవడం చర్చనీయాంశమైంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసగించిన ఏక్‌నెంబర్‌ చీటర్‌ నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం మొన్నటిదాకా ఓ కొలిక్కి వచ్చినట్లే అనిపించింది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు లైన్‌ క్లియర్‌ చేస్తూ యూకే కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. ఇంకేముందీ అయ్యగారిని ఫ్లైట్‌ ఎక్కించేస్తారని అనుకున్నారు. అయితే తాను భారత్‌కు రానని.. తనను భారత దర్యాప్తు సంస్థలకు అప్పగించొద్దని మరోసారి నీరవ్‌ మోదీ పిటిషన్‌ వేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు ఎప్పట్నుంచో సానుకూలంగానే ఉంది బ్రిటన్‌ ప్రభుత్వం. నీరవ్‌ మోదీని భారత్‌కు తీసుకొచ్చాక కేవలం ఫ్రాడ్, మనీలాండరింగ్‌ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని భారత్.. బ్రిటన్‌ ప్రభుత్వానికి చెప్పింది. ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఉంచుతామని… హై ప్రొఫైల్‌ ఖైదీలకు అందించే అన్ని సౌకర్యాలను నీరవ్ మోదీకి కల్పిస్తామని చెప్పింది. అయితే తాను ఎట్టిపరిస్థితుల్లో ఇండియాకు వెళ్లనంటూ ఇప్పటికే పదిసార్లు పిటిషన్లు వేశాడు నీరవ్ మోదీ. యూకే కోర్టు మొట్టికాయలేస్తూనే ఉన్నా పాహిమాం అంటూ మరోసారి కోర్టు ముందు సాగిలపడ్డాడు.

నీరవ్‌ మోదీ మోసం 2018 జనవరిలో వెలుగులోకొచ్చింది. ఈ స్కామ్‌పై ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించేసరికే అతడు దేశం విడిచి పారిపోయాడు. నీరవ్‌మోదీని ఈడీ పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అయితే నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబరులో బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. భారత్ విజ్ఞప్తి మేరకు నీరవ్‌మోదీ అప్పగింతకు 2021లో అప్పటి బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పట్నించీ ఆ ప్రక్రియ వాయిదాపడుతూనే ఉంది. ఇప్పుడు పదకొండోసారి తనను భారత్‌కు అప్పగించొద్దని పిటిషన్‌ వేయడంతో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది.

 

Share this post

submit to reddit
scroll to top