ప్రపంచ పారిశ్రామికవేత్తలారా రండి తరలిరండి అంటోంది తెలంగాణ సర్కార్. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని ప్రపంచానికి చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచ రికార్డులకు గ్లోబల్ సమ్మిట్‌ను వేదికగా చేసుకుంటోంది. తెలంగాణ నేలపై ఇప్పుడు చర్చంతా తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమ్మిట్ గురించే. సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన సహచర మంత్రులు ఏ వేదిక ఎక్కినా ఈ గ్లోబల్ సమ్మిట్ గురించే మాట్లాడుతున్నారు.
తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమ్మిట్‌ని ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును మలిచే మహాయజ్ఞంగా భావిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సదస్సు ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రపంచానికి తమ విజన్ ఏంటో చూపిస్తానంటోంది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న అపోజిషన్ వాదనలో పసలేదని కోకాపేటభూముల వేలంతో తేలిపోయింది. ఈ గ్లోబల్ సమ్మిట్‌తో భారీ పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించగలిగితే.. రేవంత్ సర్కారు మరో అడుగు ముందుకేసినట్లే.





