దీదీ దిక్కుమాలిన రాజకీయం!

mamatha-banarjee-rally.jpg

ప్రాణంపోసే డాక్టర్‌ పనిచేసేచోటే దారుణహత్యకు గురైంది. మరణానికి ముందు కొన్ని గంటలపాటు మానవ మృగాల క్రూరత్వానికి చిత్రవధ అనుభవించింది. ఆ బాధితురాలు ఆర్తనాదాలు సహోద్యోగులకు వినిపించలేదు. జనారణ్యంలో ఆమె ఆక్రందన ఆస్పత్రి ప్రాంగణంలో ఎవరి చెవులకీ సోకలేదు. దేశమంతా అట్టుడుకుతోంది. ఆ అభాగ్యురాలి చితిమంటలసాక్షిగా రాజకీయం చలికాచుకుంటోంది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే ఓ మహిళా డాక్టర్‌ దారుణ మరణం. ఈ హత్యాచార ఘటనతో పసిపిల్లలు సైతం కదిలిపోతున్నా.. పదవుల్లో ఉన్నవారెవరూ నైతిక బాధ్యత వహించకపోవడం దారుణం.

రాష్ట్ర రాజధానిలోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో అర్ధరాత్రివేళ ఓ మహిళా డాక్టర్‌ని అత్యాచారం చేసి చంపితే దీదీ కళ్లెందుకో చెమర్చలేదు. పైగా తన పార్టీ మహిళా దళాన్ని వెంటేసుకుని న్యాయంకోసం ఆమె రోడ్డెక్కడం మరో విడ్డూరం. జనాగ్రహం తనవైపు మళ్లకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆమె ప్రయత్నం. సీబీఐ రంగంలోకి దిగింది. దారుణానికి పాల్పడింది ఒక్కరు కాదు ఒకరికి మించి అనే అనుమానం. ఆ ఆస్పత్రిలో చీకటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సందేహం. మహిళా డాక్టర్‌ మృతికి కొందరు సహచరులే కారణమంటూ ఆడియో లీకేజీలు. ఏది నిజం? ఏది అబద్ధం? ఇప్పటికైతే దొరికింది ఒక్కడే. వాడుకూడా సర్కారు సొమ్ము తింటున్న వాలంటీర్‌. కంచే చేనుమేసినట్లు పోలీసుశాఖకు చేదోడువాదోడుగా ఉంటున్నోడు! అదనుచూసి డాక్టర్‌ని వేటాడి చంపేసింది వాడొక్కడేనా? వాడివెనుక ఇంకెవరన్నా ఉన్నారా?

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. పొరుగుదేశం కాదు కాబట్టి ఇంకా ఆమె ఆ పదవిలో ఉన్నారు. లేకపోతే బంగ్లాదేశ్‌ హసీనాలాగే తనుకూడా పాహిమాం అంటూ ఎక్కడికన్నా పారిపోవాల్సి వచ్చేదేమో! ఓ సంచలన సంఘటన జరిగితే ప్రభుత్వం ఆగమేఘాలమీద స్పందించాలి. ఉన్నతాధికారులు రంగంలోకి దిగాలి. కానీ కోల్‌కతా రేప్‌ అండ్‌ మర్డర్‌లో అడుగడుగునా నిర్లక్ష్యమే. ప్రతీ చర్యా అనుమానాస్పదమే. తెల్లవారేలోపు ఆ ఘాతుకం జరిగిపోతే ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులకు సమాచారం. కొన్ని గంటలపాటు వారు కన్నబిడ్డ మృతదేహాన్ని కూడా చూడలేనంత ఘోరం. ఇలాంటివన్నీ మామూలేనన్నట్లు తీరిగ్గా ఎఫ్‌ఐఆర్‌ నమోదు. ఎప్పుడో రాత్రయ్యాక అంత్యక్రియలు. సాక్ష్యాలు మాయం చేయడమే లక్ష్యంగా ఆస్పత్రిపై మూకదాడి. అందుకే వీటన్నిటిపై తీవ్రస్థాయిలో మండిపడింది అత్యున్నత న్యాయస్థానం. దీదీ సర్కారుకు అక్షింతలు వేసింది.

మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఆరోగ్య శాఖ బాధ్యతలు చూస్తున్నది కూడా తనే. ఆస్పత్రి ఆవరణలో అర్థరాత్రి వేళ అల్లర్లకు పాల్పడింది అధికార టీఎంసీ మద్దతుదారులేనని తేలింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఆస్పత్రి లోపలికి ప్రవేశించి సాక్ష్యాధారాలను ధ్వంసం చేశాయి. బాధితురాలి మృతదేహాన్ని వెంటనే తల్లిదండ్రులకు చూపేందుకు ఎందుకు నిరాకరించారో చెప్పాల్సింది పోలీసులే. జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య వెనుక మెడిసిన్ మాఫియా హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ పై కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని స్వయానా సుప్రీంకోర్టే తప్పుపట్టింది. ఫైర్‌బ్రాండ్‌ ముద్రతో ఇన్నేళ్లుగా రాజకీయం చేస్తున్న మమతా బెనర్జీకి ఈ హత్యాచార ఉదంతం అగ్ని పరీక్షగా మారింది. ఆమెను ఇరుకునపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ ఎంక్వయిరీ బ్రహ్మాస్త్రం కాబోతోంది. జరుగుతున్న ప్రచారం నిజమని తేలినా, ఏమాత్రం ఆధారాలు దొరికినా దీదీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందే!

Share this post

submit to reddit
scroll to top