హైదరాబాద్ మెట్రోకు ఇప్పుడు ఓనర్లెవరు? ఎవరి చేతుల్లో ఉన్నట్టు? టెక్నికల్‌గా అయితే ప్రభుత్వం చేతుల్లో, ప్రాక్టికల్‌గా మాత్రం ఎల్అండ్‌టీ చేతుల్లో. ఈ డైలమానుంచి మెట్రోని బయటపడేసేందుకు ప్రభుత్వం రంగంలో దిగింది. ఆరునూరైనా ఫ్యూచర్ సిటీకి మెట్రో నడిపి తీరతామని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా దూకుడు పెంచింది.ఎట్టి పరిస్థితుల్లో మార్చిలోగా మెట్రోను టేక్ ఓవర్ చేయాలి. మెట్రోకూ ఎల్‌అండ్‌టీకీ బంధం తెగిపోవాలి. అంతా వందరోజుల్లో జరిగిపోవాలి.. ఇదీ టార్గెట్.
హైదరాబాద్ మెట్రో ఫేస్2లో ఫ్యూచర్‌సిటీని చేర్చుకుని, మీ సపోర్ట్ కావాల్సిందే అంటూ ఇటీవల కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టింది రేవంత్ ప్రభుత్వం. కానీ ప్రభుత్వమే మెట్రోను నడపాలన్న కండిషన్‌తో కొర్రీపడింది. దీంతో యుద్ధప్రాతిపదికన మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీని తప్పించి, హోల్‌అండ్ సోల్ మెట్రో మేనేజ్‌మెంట్‌ను తమ చేతుల్లోకి తీసుకుంది తెలంగాణ సర్కార్. కానీ డీల్ జరిగి మూడునెలలౌతున్నా టేకోవర్ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగడం లేదు. అందుకే సీరియస్‌గా రంగంలోకి దిగారు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ.
టేకోవర్ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యదర్శుల కమిటీతో, L&T అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. టేకోవర్ ప్రణాళికపై లోతుగా సమీక్షించారు. ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా జరగాలి, వేగంగా జరగాలి, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ వందరోజుల్లో ట్రాన్సాక్షన్ అడ్వైజరీ నివేదికను వేగంగా పూర్తి చేసి బదలాయింపు ప్రక్రియను ఫైనల్ చేయాలి, మెట్రో రైల్ ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలి.
నిజానికి మెట్రో టేకోవర్ డీల్ అనుకున్నంత ఈజీగా ఏమీ జరగలేదు. రేవంత్ నిర్ణయాలన్నీ సెంట్రల్ మెట్రో యాక్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయని, ఎల్‌అండ్‌టీపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని అపోజిషన్ పార్టీ ఆరోపించింది. 280 ఎకరాల మెట్రో భూములపై కన్నేశారని, మెట్రో ప్రాజెక్ట్‌ను పొంగులేటి కంపెనీకి అప్పజెప్పటానికే L&Tని తరిమేశారనే ఆరోపణలు వచ్చాయి. నష్టాల మెట్రోతో ఎలా వేగుతారన్న మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఇలా అనేక సవాళ్లు, చిక్కుముళ్ల మధ్య L&T నుంచి మెట్రోను టేకోవర్ చేసుకుంది రేవంత్ సర్కార్.
వీలైనంత త్వరగా మెట్రో టేకోవర్‌ను పూర్తి చేసి, ఆవెంటనే మెట్రో రెండో దశపై ముందుకెళ్లాలని పట్టుదలతో ఉంది రేవంత్ ప్రభుత్వం. దేశంలో 9వ స్థానానికి పడిపోయిన హైదరాబాద్ మెట్రోను, మళ్లీ టాప్ పొజిషన్‌లోకి తీసుకురావాలి. L&T నుంచి సంక్రమించిన 13 వేల కోట్ల అప్పును తీర్చెయ్యాలి. టేకోవర్ డీల్ ప్రకారం ఎల్‌అండ్‌టీకి 2వేల కోట్లు అదనంగా చెల్లించాలి. భాగ్యనగరవాసులకు మాటిచ్చినట్టు మెట్రో రెండోదశను పట్టాలెక్కించాలి. ఇన్ని సవాళ్ల మధ్య మెట్రో స్టీరింగ్‌ను అందుకోబోతోంది రేవంత్ ప్రభుత్వం. 2026 మార్చిలోగా టేకోవర్ ముగిసి పూర్తిగా చేజిక్కించుకున్న తర్వాత మెట్రో 2.0 మొదలవుతుందన్నమాట!





