లంకంత కొంపలు. బడాబాబులు వద్దంటే డబ్బు. అంత రిచ్ ఫ్యామిలీల్లో ఖర్చుపుట్టడానికే పుడతారేమో పిల్లలు. పబ్బులచుట్టు తిరుగుతూ, మందు మత్తులోనే కార్లు నడిపి అడ్డమొచ్చినవారిని తొక్కేస్తున్నారు కొందరు. హైదరాబాద్‌లో గబ్బు రేపుతున్న పబ్బుల వ్యవహారాన్ని చూసి చిర్రెత్తుకొచ్చిన తెలంగాణ హైకోర్టు ఘాటు కామెంట్లు చేసింది. పబ్బులకు కళ్లెం వేయాలని పోలీసులను ఆదేశించింది. 2022లో ఓ పబ్‌కి మైనర్ బాలికతో వచ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడింది. దీంతో అప్పట్లో ఈ పబ్బుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. జూబ్లీహిల్స్‌లో రాత్రి 10తర్వాత గోడలు దాటి డీజే సౌండ్ బయటికి వినిపించకూడదని చెప్పింది. మళ్లీ హైకోర్టు జోక్యంచేసుకునేదాకా వచ్చింది. అంటే రెండేళ్లలో పబ్బుల గబ్బు ఏమాత్రం తగ్గలేదని అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఈమధ్య హైదరాబాద్ పబ్స్‌లో అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బాచుపల్లిలో బార్ పర్మిషన్ తీసుకుని ఏకంగా టకీల పబ్ స్టార్ట్ చేశాడో ప్రబుద్ధుడు. ఫారిన్ అమ్మాయిలతో డ్యాన్సులు చేయించి జనాన్ని రప్పించాడు. ఇక టాస్ అనే పబ్ అయితే మరీ ఘోరం. అమ్మాయిలకు ఇన్సెంటివ్‌లు ఆఫర్ చూపి కస్టమర్లతో భారీగా బిల్లులు చేయించడం వారి డ్యూటీ. పబ్ కల్చర్‌కి అలవాటుపడ్డ హైసొసైటీ అమ్మాయిలే కాదు.. పూటగడవని వారు, ఈజీ మనీకి అలవాటుపడ్డవారు, స్వామికార్యం స్వకార్యం అనుకునేవారందరికీ ఇప్పుడు హైదరాబాద్ పబ్బులు గమ్యస్థానాలు.
డ్రెస్ కోడ్ అడగడం లేదు. జంటగా వచ్చారో లేదో చూడటం లేదు. ఆ మాటకొస్తే పబ్బులకు కూడా కావాల్సింది సింగిల్‌గా రావడమే. లోపలికి వెళ్లగానే చుట్టూ చేరడానికి బోలెడుమంది అమ్మాయిలు రెడీ. కాసేపు కంపెనీ ఇవ్వడానికా, కోరుకున్నంత సేపు సరసాలాడానికా అన్నది ఆ ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాల్ని బట్టి ఉంటుంది. కస్టమర్లతో పెగ్గుల మీద పెగ్గులు తాగించడానికి అందమైన అమ్మాయిలతో వల విసురుతున్నాయి కొన్ని పబ్స్. ఎంత తాగిస్తే అంత కమీషన్ అంటూ హనీట్రాప్‌లా మనీ ట్రాప్ చేస్తున్నాయి. పబ్బుకు వచ్చే కస్టమర్లతో పరిచయం పెంచుకోవడం ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత అందమైన ఆఫర్ ఇస్తారు. అమ్మాయితో మందు కొట్టే ఛాన్స్ వస్తోందని అమాయకుడెవడన్నా ఓకే అన్నాడా.. వాడి జేబు ఖాళీ అయ్యిందన్నమాటే.
అందమైన అమ్మాయిల అశ్లీల అర్ధ నగ్న నృత్యాలు హైదరాబాద్ పబ్బుల్లో అదనపు ఆకర్షణ. మ్యూజిక్ హోరులో, లైట్ల వెలుగులో ఎవరేం చేస్తున్నారో అర్ధమేకాదు. పబ్బుల యవ్వారం ఇలా గబ్బు రేపుతుంటే, బడా బాబులు పిల్లలు పబ్బుల్లో ఫుల్లుగా మందు కొట్టి…బయట యాక్సిడెంట్లు చేసి జనాన్ని పరేషాన్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ పబ్‌ల తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. సంపన్నులు సంపాదిస్తుంటే వాళ్ల పిల్లలు పబ్బుల దగ్గర హంగామా చేస్తున్నారని కామెంట్ చేశారు హైకోర్టు జస్టిస్ విజయ్‌సేన్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోనే 60 దాకా పబ్బులున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుకో ప్రమాదం జరుగుతోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పబ్బుల బయట స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని, పబ్‌లకు మరిన్ని నిబంధనలు విధించాలని సూచించింది హైకోర్టు. పోలీసులకు ఏ మొహమాటాలు లేకపోతే, ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోతే హైదరాబాద్‌లో పబ్స్ ఇలా రెచ్చిపోతాయా?