డీఎంకేకి ఇళ‌య‌ద‌ళ‌ప‌తి ఫిటింగ్!

vijay-flag-and-symbol-of-political-party.jpg

తమిళగ వెట్రి కజగం. షార్ట్‌క‌ట్‌లో టీవీకే. కోలీవుడ్‌లో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో విజ‌య్ ప్ర‌క‌టించిన పార్టీ. పార్టీ ఫ‌స్ట్ మీటింగ్‌లోనే విజయ్ పేల్చిన డైలాగ్‌ల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నాయి ద్ర‌విడ పార్టీలు. అధికారంలో ఉన్న‌ డీఎంకేకి కొత్త పార్టీ తొలి అడుగుతోనే స‌వాల్ విసిరింది. రాజకీయంగా తొలి అడుగు వేశారు ఇళ‌య దళపతి విజయ్‌. విల్లుపురంలో తమిళగ వెట్రి కళగం గ్రాండ్‌గా నిర్వహించిన పార్టీ మహానాడుకి లక్షలాది మంది తరలివచ్చారు. 2026 ఎన్నికలు లక్ష్యంగా విజయ్ చేసిన ప్రసంగం .. తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారింది.

తమిళ రాజకీయాలు టోటల్ డిఫరెంట్‌. పార్టీలు జతకడతాయి. మూకుమ్మడిగా ప్రచారం చేస్తాయి. ప్రధాన పార్టీ సింబల్‌పైనే పోటీ చేస్తాయి. అధికారంలోకి వచ్చాక‌ మాత్రం… ప్ర‌ధాన పార్టీనే అధికారాన్ని అనుభవిస్తుంది. మిత్రపక్షాలకు ప్రభుత్వంలో పాలు పంచుకునేందుకు అవకాశం ఇవ్వదు. డీఎంకే కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్‌తో జతకట్టి పవర్‌లోకొచ్చింది. కానీ ఆ పార్టీ నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. సరిగ్గా ఈ పాయింటే ప‌ట్టుకున్నారు విజయ్‌. కూటమిలో ఉన్న పార్టీలన్నీ సమానమైనా అధికారంలోకి వస్తే భాగస్వామ్యం ఎందుకు ఉండదని నిలదీశారు. టీవీకే మిత్రపక్షాలతో గెలిస్తే కచ్చితంగా వాళ్లకు తగిన ప్రాధాన్యం కల్పిస్తానని హామీనిచ్చారు.

అస‌లే డీఎంకే కూటమి విడిపోతుందని కొన్నాళ్లుగా చర్చ జోరందుకుంది. ఇదే సమయంలో విజయ్‌ స్పందించడం డీఎంకేకు ఇబ్బందికరంగా మారింది. దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం స్టాలిన్. కూటమిలో వివాదాలు ఉన్న మాట నిజమే కానీ చీలికలు లేవన్నారు. మరోవైపు విజయ్ పేల్చిన బాంబ్‌తో అటు కాంగ్రెస్‌లో కూడా చర్చ మొదలైంది. తమకు అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ ఏకంగా సీఎం స్టాలిన్‌కు లేఖరాశారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్‌. మాణిక్కం ఠాగూర్‌ లాంటి నేతలు కూడా విజయ్ వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు పల‌క‌డం డీఎంకేకి మింగుడుప‌డ‌టం లేదు. నిజానికి 2006లో డీఎంకే మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌కి పదవులు కట్టబెట్టలేదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో బలం ఉండి పదవులివ్వ‌డం జ‌రిగే ప‌నికాదు. మొత్తానికి విజయ్ ప్రసంగానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే.. డీఏంకే మాత్రం తల పట్టుకుంటోంది.

Share this post

submit to reddit
scroll to top