తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి హ్యాట్రిక్ టార్గెట్‌గా బీఆర్‌ఎస్ స్పీడ్‌పెంచింది. మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. మజ్లిస్ కలిసే పోటీ చేస్తున్నామని అభ్యర్థుల ప్రకటన సమయంలోనే కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రకటనపై మొదట స్పందించని మజ్లిస్ పార్టీ ఇప్పుడు తమ మద్దతు గులాబీపార్టీకేనని క్లారిటీ ఇచ్చేసింది.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం నమ్మకమైన మిత్రులు. ఎనిమిదేళ్లుగా కలసే నడుస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యక్ష పొత్తులు లేకపోయినా ఒకరి ఇలాకాలో మరొకరు జోక్యం చేసుకోరు. చట్టసభల్లో ప్రభుత్వానికి ఎంఐఎం అండగా నిలుస్తూ వస్తోంది. అన్ని విషయాల్లో అనధికారిక మిత్రపక్షంగానే వ్యవహరిస్తోంది. పాతబస్తీలోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. అలానే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. కానీ ప్రత్యర్థుల్లాకాదు ఫ్రెండ్లీ కాంటెస్ట్ నడుస్తుంటుంది ఆ రెండుపార్టీల మధ్య.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎనిమిది సీట్లలోనే పోటీచేసింది. కొన్ని పాతబస్తీ కాలనీలు ఉండే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రమే ఓడిపోయింది. అన్ని చోట్లా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఒవైసీ పార్టీ సంకేతాలు పంపింది. దీంతో ముస్లిం సామాజికవర్గం ఎక్కువ ఉన్న చోట్ల బీఆర్ఎస్ సులువుగా గెలిచింది. బండి సంజయ్ గెలుస్తారనుకున్న కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ విజయం వెనుక కూడా మజ్లిస్ మద్దతే కీలకం. ఈసారి కూడా దోస్త్ మేరా దోస్త్ అంటూ ముందుకెళ్తున్నాయి బీఆర్‌ఎస్-మజ్లిస్. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కి మద్దతివ్వాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగానే ప్రకటించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం తెలంగాణలో మాత్రం పాతబస్తీకే పరిమతమవుతూ వస్తోంది. ఈసారి ఎన్నికల్లో దాదాపు 30 సీట్లలో పోటీకి ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 40 చోట్ల ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ ఉమ్మడిజిల్లాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు గెలుపోటముల్ని ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు బలంగా ఉన్నారు. వాటిలో ఏడు సీట్లు ఎంఐఎంకి కంచుకోట. పాతబస్తీ దాటిపోటీచేసినా ఓట్లు చీలకుండా రెండు పార్టీలకు ప్రయోజనం చేకూరేలా మజ్లిస్ ప్లాన్ చేస్తోంది.