హార్ముజ్‌ జలసంధి ఎందుకంత కీలకం?

harmuzz-straiat-e1772552717359.jpg

మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు ప్రపంచదేశాల ఆయువుపట్టు ఇరాన్‌ ఆధీనంలోని హార్ముజ్‌ జలసంధిలో ఉంటుంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణంతో హార్ముజ్‌లోకి ప్రవేశిస్తే నౌకల్సి పేల్చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ స్ట్రెయిట్‌ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో వందదాకా కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి.

పర్షియన్‌ గల్ఫ్‌ని అరేబియా సముద్రంతో అనుసంధానించడంలో హార్ముజ్‌ జలసంధి కీలకం. ఇరాన్‌, ఇరాక్‌ దేశాల చమురు, అరబ్‌ ఎమిరేట్స్‌, ఖతర్‌ ఉత్పత్తిచేసే సహజవాయువు రవాణాకు హార్ముజ్‌ జలసంధి ఏకైకమార్గంగా ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఈ మార్గంలోకి ప్రవేశించే, బయటికొచ్చే దగ్గర సుమారు 50 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర అత్యంత ఇరుకైనచోట కేవలం 40 కి.మీల వెడల్పే ఉంది. అవసరమైన లోతు ఉండే కేవలం 10 కి.మీ వెడల్పు మార్గం గుండానే భారీ నౌకలు ప్రయాణించాల్సి ఉంది.

1980 నుంచి 1988 వరకు ఇరాన్-ఇరాక్ యుద్ధం కొనసాగిన సమయంలో రెండు దేశాలు ఈ జలమార్గం ద్వారా ఒకదానికొకటి చమురు సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాయి. అప్పట్లో చమురు ట్యాంకర్లపై దాడి చేసేందుకు ఇరాన్ సిల్క్‌వార్మ్ మిసైళ్లను మోహరించింది. గల్ఫ్ జలాల్లో నేవల్ మైన్లను వేసింది. తాజా ఉద్రిక్తతలతో హార్ముజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్‌.. ఆ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని హెచ్చరించింది. నౌకలు ఈ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దాడి చేసేందుకు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ని మోహరించింది.

ఖమేనీ ఎక్కడున్నాడో కనిపెట్టి గురితప్పకుండా మట్టుబెట్టినంత తేలికకాదు హార్ముజ్‌లో ఇరాన్‌ ఆటకట్టించడం. అందుకే అప్పుడే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మొదలైపోయింది.

Share this post

submit to reddit
scroll to top