అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లే ఉంది. అమెరికా డైరెక్షన్‌లో ఇజ్రాయెల్ యాక్షన్‌కి దిగితే ఇరాన్ మాత్రం అరబ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ చర్యలను గల్ఫ్‌దేశాలు ఖండిస్తున్నాయే తప్ప ప్రత్యక్ష దాడులకు దిగడం లేదు. అమెరికాకు పరోక్షంగా మద్దతిచ్చినా టార్గెట్ అవుతారని ఇరాన్ హెచ్చరిస్తోంది. అగ్రరాజ్యం సైనికస్థావరాలే లక్ష్యమంటూ గల్ఫ్ దేశాల భూభాగాలపై మిసైల్స్ సంధిస్తోంది. అయినా ఆ దేశాలేవీ ఇరాన్‌పై విరుచుకుపడకపోవడానికి కొన్ని కారణాలున్నాయి.
మూడు దశాబ్దాలుగా అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలు మధ్యప్రాచ్యంలో స్థిరత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. కానీ అయతొల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారదాడులకు దిగటంతో ఆ స్థిరత్వ భావన దెబ్బతింది. అమెరికా సైనిక స్థావరాలే కాకుండా దుబాయ్, అబుదాబిలోని హోటళ్లు, నివాస ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. అయినా అరబ్ దేశాలు ప్రత్యక్ష సైనిక ప్రతీకారానికి దిగలేదు.
ఖమేనీ కేవలం ఇరాన్ నాయకుడే కాదు, ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలకు ఆధ్యాత్మిక నాయకుడు కూడా. ఇరాన్‌పై ప్రతీకారానికి దిగితే అది సమిష్టి ఇస్లామిక్ సమాజానికి (ఉమ్మా) వ్యతిరేకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచినట్టు ప్రపంచ ముస్లింల ముందు ఆ దేశాలను దోషులుగా నిలబెట్టే అవకాశం ఉంది.విదేశీ దాడులు, ముస్లిం నాయకులపై దాడుల సమయంలో ముస్లిం ఉమ్మా అనే భావన బలంగా వినిపిస్తుంది.
ఇరాన్ షియాల దేశమైతే అరబ్ దేశాలు ఎక్కువగా సున్నీ ముస్లింలతో ఉన్నాయి. 1989లో అయతొల్లా రుహొల్లా ఖొమేని మరణించినప్పుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సంతాపం ప్రకటించారు. సిరియా, లెబనాన్ దేశాలు కూడా అధికారిక సంతాప దినాలు ప్రకటించాయి.ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం వంటి అంశాలు షియా సున్నీ తెగల విభేదాలు పక్కనపెట్టి.. ముస్లింల ఐక్యతను ముందుకు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులకు దిగడానికి అక్కడి అమెరికా సైనిక స్థావరాలే ప్రధాన కారణం. యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ వంటి కేంద్రాలు అమెరికా వైమానిక దళానికి కీలకం.
- సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్‌కోపై ఇరాన్ డ్రోన్ దాడి
- దుబాయ్, దోహాలో పేలుళ్లు.. బహ్రెయిన్ సల్మాన్ పోర్ట్‌పైనా దాడి
- ఒమన్‌లో చమురు నౌకపై అటాక్.. భారతీయుడి మృతి
- గల్ఫ్‌లోని యూఎస్ ఎయిర్ బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ దాడులు
- కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై దాడిలో ముగ్గురు సైనికుల మృతి
- కువైట్ ఆర్మీ పొరపాటుతో కూలిన 3 అమెరికా ఫైటర్ జెట్స్
- మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిపై ఇరాన్ అటాక్
- అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కొన్నిగంటలు మూత
అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్ సంయుక్త ప్రకటనలో ఇరాన్ చర్యలను ఖండించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. కానీ ఇరాన్ దాడుల బాధిత దేశాలేవీ ప్రత్యక్ష సైనిక చర్యకు దిగలేదు. చాలా దేశాలు తమ గగనతలాన్ని అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ఉపయోగించలేదని ప్రకటించాయి. అరబ్ దేశాలు దాడి చేస్తే వారి రాజభవనాలు లక్ష్యంగా మారుతాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు మద్దతిస్తూ ఇరాన్‌పై దాడికి దిగితే ప్రపంచ ముస్లింలలో వ్యతిరేక భావన వస్తుందనే గల్ఫ్‌దేశాలు ప్రతీకార చర్యకు దిగడం లేదు.
పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పోరాడే ఇస్లామిక్ నాయకత్వంగా ఇరాన్ తనను తాను ప్రమోట్ చేసుకుంటోంది. ఖమేనీ మరణాన్ని త్యాగంగా ప్రచారం చేస్తోంది. ఖోమ్ పవిత్ర నగరంలోని జమ్‌కరాన్ మసీదుపై ఎర్ర జెండా ఎగరవేయడం షియా సంప్రదాయంలో అమరుల రక్తానికి ప్రతీక. ఇరాన్ విరుచుకుపడుతున్నా.. అరబ్ దేశాల సహనానికి వ్యూహాత్మక లెక్కలు, ఆర్థిక ప్రయోజనాలు, భద్రతా ఆందోళనలు, అలాగే ముస్లిం ఉమ్మా భావన అన్నీ కలగలిపి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆవేశపడి ఇరాన్‌పై దాడిచేస్తే అది మతపరమైన, రాజకీయపరమైన ప్రతిఫలాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే గల్ఫ్ దేశాలు అంత సంయమనంతో ఉన్నాయి.





