తమిళనాడులో పొలిటికల్ సమీకరణాలు ఊహించనివిధంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభావంపై ప్రధానపార్టీలు ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. వాస్తవానికి విజయ్ టీవీకే పార్టీకి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నిర్మాణం లేదు. బూత్ స్థాయి కేడర్ లేదు. అనుభవజ్ఞులైన రాజకీయ నేతల బృందం లేదు. విజయ్ తర్వాత చెప్పుకోదగ్గ మాస్ లీడర్ లేడు. అయినా సర్వేలు మాత్రం టీవీకేకు 15నుంచి 20 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం ప్రధానపార్టీలకు మింగుడుపడడంలేదు.
ఉత్తర తమిళనాడులో వీసీకే, పీఎంకే ఓట్లలో చీలిక రావడం జరిగితే పెద్ద పార్టీలకూ నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే డీఎంకే, ఏఐఏడీఎంకే రెండూ జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాయి. సామాజికవర్గ ఓట్ల పరంగా కూడా టీవీకే పార్టీ ప్రభావం కనిపిస్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా డీఎంకే వైపే ఉంటారని అంచనా. అయితే క్రిస్టియన్ ఓటర్లలో ఒక వర్గం విజయ్‌పై ఆసక్తి చూపుతోంది. దీనికి తోడు మొదటిసారి ఓటు వేయబోయే యువత, పట్టణాల్లో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువకులు విజయ్ సభలకు తండోపతండాలుగా తరలిరావడం కూడా ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
డీఎంకేకు ఏఐఏడీఎంకేతో రాజకీయంగా ఎలా పోరాడాలో తెలుసు. బీజేపీతో ఎలా వ్యవహరించాలో తెలుసు. కానీ రాజకీయాన్ని ఒక ఈవెంట్‌లా చూసే ఓ వర్గాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం అర్థం కావడం లేదు. కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఇది స్పష్టంగా కనిపించింది. ఇతర పార్టీల సభల్లో జరిగే ఘటనలపై వెంటనే చర్యలు తీసుకునే ప్రభుత్వం, కరూర్ ఘటనలో మాత్రం రియాక్షన్ చాలా లేట్‌గా కనిపించింది. విజయ్ పార్టీపై అధికార డీఎంకే ఓ అంచనాకు రాలేకపోవడమే దీనికి కారణమంటున్నారు.
మామూలుగా విజయ్ సభలకు వచ్చే జనాలు పొలిటికల్ ఇంట్రస్ట్‌తో రావడంలేదు. తమ అభిమాన హీరోని చూడటానికే వస్తున్నారు. దగ్గరగా ఉండాలని, వీలైతే ఫోటోలు, గట్రా తీసుకోవాలన్న ఆరాటంతో వస్తున్నారే తప్ప మరో కారణం లేదన్నది విశ్లేషకుల మాట. నిపుణుల మాటల్లో చెప్పాలంటే విజయ్ సభలు, లీడర్-క్యాడర్ రిలేషన్‌తో కాకుండా , హీరో -ఫ్యాన్ మధ్య సంబంధంలాగే ఉంటున్నాయి. అది భావోద్వేగంతో మొదలై జనసమూహంగా మారుతోంది. విజయ్ రాజకీయాల్లోకి సిద్దాంతాలతో ఒక భావోద్వేగంతోనే వచ్చారంటున్నారు విశ్లేషకులు.
ఎవరేమనుకున్నా డీఎంకే, అన్నాడీఎంకేకి తమిళనాట తామే ప్రత్యామ్నాయం అంటోంది విజయ్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెబుతోంది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్, విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాటలు. కాంగ్రెస్‌తో కలిస్తే విజయ్ పార్టీ కొత్త చరిత్ర సృష్టిస్తారని తండ్రి చెప్పడం తమిళనాడు రాజకీయాల్లో కొసమెరుపు





